తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండో రాజధానిగా మధురై- వికేంద్రీకరణా? ఓట్ల వ్యూహమా?

తమిళ రాజకీయం... 'కొత్త రాజధాని' చుట్టూ తిరుగుతోంది. మధురైని రాష్ట్రానికి రెండో రాజధానిగా చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఎందుకిలా? అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యమా? లేక ఎన్నికల వ్యూహమా?

AIADMK Ministers' Demand
రెండో రాజధానిగా మధురై- వికేంద్రీకరణా? ఓట్ల వ్యూహమా?

By

Published : Aug 19, 2020, 5:56 PM IST

"మధురైని తమిళనాడుకు రెండో రాజధాని చేస్తే దక్షిణ జిల్లాలు అభివృద్ధి చెందుతాయి. గుజరాత్​లో సగం ప్రభుత్వ కార్యాలయాలు అహ్మదాబాద్​లో, మిగిలిన సగం గాంధీనగర్​లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్​లోనూ మూడు రాజధానులు వస్తున్నాయి."

- ఉదయ కుమార్, తమిళనాడు రెవెన్యూ మంత్రి

రెవెన్యూ మంత్రి ఉదయ కుమార్​

"మధురైని రెండో రాజధాని చేయాలని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్​ అప్పట్లో అనుకున్నారు. తమిళ సమ్మేళనాన్ని మధురైలోనే నిర్వహించారు. జయలలిత ముఖ్యమైన నిర్ణయాలన్నీ మధురైలోనే తీసుకునేవారు. మధురై రెండో రాజధాని కావాలన్నదే ఆ ఇద్దరి ఆకాంక్ష."

-సెళ్లూర్ కె. రాజు, తమిళనాడు కో-ఆపరేటివ్ శాఖ మంత్రి

సహకార మంత్రి సెళ్లూర్​ కె. రాజు

రెండో రాజధానిగా మధురై...తమిళనాడులో ఇప్పుడు ఈ అంశంపైనే విస్తృత చర్చ జరుగుతోంది. ఏకంగా రాష్ట్ర మంత్రులే ఈ డిమాండ్​ను బలంగా వినిపిస్తున్నారు. మధురై జిల్లా తిరుమంగళం అన్నాడీఎంకే నేతలు ఇందుకోసం ఓ తీర్మానం కూడా చేశారు.

మధురై

మధురై ఎందుకు?

మధురై... తమిళనాడు సాంస్కృతిక రాజధాని. ఆ రాష్ట్రంలో మూడో అతిపెద్ద నగరం. చారిత్రక ఆలయాలు, కళలకు పెట్టింది పేరు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఆ ఆలయ నగరిని రెండో రాజధాని చేయాలని అంటున్నారు అన్నాడీఎంకే నేతలు. డిమాండ్​ను సమర్థించుకునేందుకు వారు చేస్తున్న వాదనలు ఇలా ఉన్నాయి:

  • మధురైని రెండో రాజధాని చేయాలన్నది దక్షిణ జిల్లాల ప్రజల చిరకాల డిమాండ్.
  • మధురైలో ఇప్పటికే హైకోర్టు బెంచ్ ఉంది. ఎయిమ్స్​ ఉంది. తూత్తుకుడి పోర్టు 150కి.మీ దూరంలోనే ఉంది. ఒక వెయ్యి ఎకరాలు సేకరిస్తే.. మధురైని రెండో రాజధాని చేయడం సులువు.
  • తమిళనాడులో దక్షిణాన ఉన్న కన్యాకుమారి నుంచి రాజధాని చెన్నైకి మధ్య దూరం 700 కి.మీ. ఈ కారణంగా దక్షిణాది ప్రజలు అన్ని సౌలభ్యాలను పొందలేకపోతున్నారు. అక్కడికి వెళ్లలేకపోతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా.. చెన్నైలో జనాభా విపరీతంగా పెరుగుతోంది. పరిపాలనా సౌలభ్యం కోసం రెండో రాజధాని ఉంటేనే చెన్నైపై ఒత్తిడి తగ్గుతుంది.
  • మధురైని రెండో రాజధాని చేస్తే చుట్టుపక్కలున్న ట్రిచీ, విరుధానగర్, రామ్నాడు, పుదుకొట్టై, తంజావూరు జిల్లాలూ అభివృద్ధి చెందుతాయి. దక్షిణాది జిల్లాలైన తూత్తుకుడి, తిరునెల్వేలి, టెంకాసీ, కన్యాకుమారి నుంచి.. మధురైకి పెద్ద దూరమేమీ లేదు.
  • మహారాష్ట్ర(ముంబయి, నాగ్​పుర్​), కర్ణాటక(బెంగళూరు, బెళగావి), జమ్ముకశ్మీర్​(శ్రీనగర్, జమ్ము) కు ఇప్పటికే రెండు రాజధానులు ఉన్నాయి.

నాలుగు దశాబ్దాల క్రితమే...

దక్షిణ తమిళనాడులో రాజధాని కొత్త విషయమేమీ కాదు. 1983లో ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెన్నై నుంచి తిరుచిరాపల్లికి రాజధానిని తరలించాలని ప్రతిపాదించారు. కానీ... అలా చేయడం వల్ల పడే ఆర్థిక భారం, జరిగే నష్టాలను దృష్టిలో ఉంచుకుని వెనక్కు తగ్గారు. ఇప్పుడు తరలింపు కాకుండా, రెండో రాజధాని రూపంలో మధురై తెరపైకి వచ్చింది.

ఎంజీఆర్​, దివంగత మాజీ ముఖ్యమంత్రి

దాదాపు దశాబ్ద కాలంగా అన్నాడీఎంకే అధికారంలో ఉంది. మరి ఇన్నేళ్లు గుర్తురాని మధురై ఇప్పుడే ఎందుకు ప్రాధాన్యాంశమైంది?

వికేంద్రీకరణా? రాజకీయమా?

2021... తమిళనాడుకు రాజకీయంగా అతి కీలకమైన ఏడాది. జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజాల మరణానంతరం తొలిసారి శాసనసభ ఎన్నికలు జరిగేది వచ్చే ఏడాదే. వరుసగా రెండు సార్లు ఓటమి తర్వాత ఎలాగైనా విజయదుందుబి మోగించాలని భావిస్తోంది ప్రతిపక్ష డీఎంకే. అందుకోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. సినీ నటులు కమల్​ హాసన్​, రజినీకాంత్​ ఎంత మేర ప్రభావం చూపగలరన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

జయలలిత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి

అధికార అన్నాడీఎంకే మాత్రం అత్యంత సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటోంది. జయలలిత స్థాయి సారథి ఎవరూ లేరు ఆ పార్టీకి. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్​సెల్వం రాజీపడి, కలిసి ప్రభుత్వం నడుపుతున్నా... ఆ ఇద్దరి వర్గాల మధ్య మాత్రం క్షేత్రస్థాయిలో ఐక్యత లోపించింది. 2021 ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరన్న చర్చ ఇప్పుడిప్పుడే పార్టీలో వివాదంగా మారుతోంది. ప్రభుత్వానికి ప్రజాదరణ క్రమంగా తగ్గుతూ ఉండడం, కరోనా కట్టడి విషయంలో విమర్శలు, మిత్రపక్షం భాజపాతో దూరం పెరగడం వంటి ఇబ్బందుల సంగతి సరేసరి.

ఇలాంటి అంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే అన్నాడీఎంకే ఇప్పుడు రెండో రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చిందన్నది రాజకీయ విశ్లేషకుల మాట.

ముఖ్యమంత్రి పళనిస్వామి

ఆయనకు నష్టం.. ఈయనకు లాభం

అన్నాడీఎంకే బహిష్కృత నేత, అమ్మ మక్కళ్ మున్నేట్ర కళగమ్ వ్యవస్థాపకుడు టీటీవీ దినకరన్​కు దక్షిణ తమిళనాడులో మంచి పట్టుంది. జయ అభిమానుల ఓట్లను దినకరన్ పార్టీ చీల్చకుండా చూడడం అన్నాడీఎంకేకు ఎంతో కీలకం. అందుకోసమే మధురైని రెండో రాజధానిని చేస్తామంటూ... అధికార పక్షం దక్షిణాది జిల్లాల ఓటర్లపై గురిపెట్టినట్టు కనిపిస్తోంది.

కరుణానిధి కుమారుడు అళగిరికీ మధురైలో మంచి ఆదరణ ఉంది. ఇప్పుడు మధురైని రెండో రాజధానిని చేస్తే... సొంత ఓట్లు చీలకుండా చూడడమే కాక, ప్రత్యర్థిపైనా పైచేయి సాధించవచ్చన్నది అన్నాడీఎంకే వ్యూహంగా కనిపిస్తోంది.

ఉపముఖ్యమంత్రి పన్నీర్​సెల్వం సొంత జిల్లా థేని. మధురై పక్కనే ఉంటుంది. ఇప్పుడు రెండో రాజధాని అంశంతో సెల్వం కూడా లాభపడే అవకాశాలు ఉన్నాయి.

ఓ పన్నీర్​ సెల్వం, ఉప ముఖ్యమంత్రి

తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉండి, ఇప్పుడే రెండో రాజధానిని ఎందుకు తెరపైకి తెచ్చారని ప్రశ్నిస్తోంది డీఎంకే. ఈ అంశంపై తమిళ ఓటర్లు ఎలా స్పందిస్తారన్నదే అసలు ప్రశ్న.

ABOUT THE AUTHOR

...view details