రైల్వేను ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తోంది కేంద్రం. రైల్వేశాఖ సబ్సిడరీ ఐఆర్సీటీసీకి దిల్లీ-లఖ్‌నవూ, అహ్మదాబాద్-ముంబయి మధ్య రాకపోకలు సాగించే తేజస్ రైళ్ల నిర్వహణ బాధ్యతలను అప్పగించేందుకు యోచిస్తోంది. ప్రైవేటీకరణకు ముందు పైలట్ ప్రాజెక్ట్‌గా ఐఆర్సీటీసీకి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
రైల్వేబోర్డు బ్లూప్రింట్ ప్రకారం ఇప్పటివరకు పర్యటక, భోజన వసతులను నిర్వహిస్తోన్న ఐఆర్సీటీసీకి రెండు రైళ్ల టికెట్ ధరలనూ నిర్ణయించే అధికారం హస్తగతం కానుంది. ఐఆర్సీటీసీ మూడేళ్లపాటు ఈ రైళ్ల బాధ్యతలను నిర్వర్తిస్తుంది. వీటిలో రాయితీలు, గౌరవార్థ టికెట్ కేటాయింపులు, ఉద్యోగ పాసులు పనిచేయకుండా ఉండే దిశగా రైల్వేశాఖ నిర్ణయించిందని సమాచారం. టికెట్ల తనిఖీలు కూడా రైల్వే ఉద్యోగులు చేయరని అధికారులు వెల్లడించారు.
రైలు సర్వీసు నెంబర్లు, కార్యనిర్వాహక ఉద్యోగులు, చోదకులు, గార్డులు, స్టేషన్ మాష్టర్లుగా రైల్వే ఉద్యోగులే పనిచేయనున్నారు.
రైల్వేల్లో ప్రైవేటు యాజమాన్యాలను ప్రవేశపెట్టడం ద్వారా ప్రపంచ స్థాయి ప్రయాణ సేవలను అందించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ మేరకు 100 రోజుల ప్రణాళికలో లక్ష్యించింది. ఈ నేపథ్యంలోనే రెండు రైళ్లను ఐఆర్సీటీసీకి అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంది.