రైతులకు మద్దతుగా తాను వినిపించిన గళాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని శిరోమణి అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను నిలిపివేసి సమీక్ష కోసం పార్లమెంటరీ ప్యానెల్‌కు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి పదవికి చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత విలేకరులతో మాట్లాడారు కౌర్. తన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి వివరించేందుకు చాలా సార్లు ప్రయత్నించినట్లు తెలిపారు. రైతులను సంప్రదించిన తర్వాతే ఈ బిల్లులను తీసుకురావాలని సూచించారు. బిల్లులపై రైతులకే భయాలు ఉన్నాయని.. అలాంటప్పుడు వారి ప్రయోజనార్థమే బిల్లులు తీసుకొస్తున్నామని కేంద్రం చెప్పడంలో అర్థంలేదన్నారు.
"కేబినెట్ సభ్యుల స్పందన కోరినప్పటి నుంచి ఆర్డినెన్సుపై నేను నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నాను. వ్యవసాయదారుల ఆందోళనలకు పరిష్కారం లభించేలా రైతులకు, ప్రభుత్వానికి వారధిలా ఉన్నాను. నా గళాన్ని ప్రభుత్వం వినిపించుకోనందుకు చాలా బాధగా ఉంది. నా మాట విని ఉంటే ఇంత మంది రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన చేసేవారు కాదు."
-హర్సిమ్రత్ కౌర్ బాదల్, అకాలీదళ్ ఎంపీ