పశ్చిమ్ బంగలో ఉద్రిక్త పరిస్థితుల్ని సద్దుమణిగేలా చేసేందుకుజూనియర్ డాక్టర్లను చర్చలకు ఆహ్వానించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కానీ వారు మమత ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఇది తమ ఐక్యత, నిరసనల విచ్ఛిన్నానికి చేస్తోన్న చర్యగా అభివర్ణించారు.
శనివారం సాయంత్రం వరకు గడువు
రాష్ట్ర సచివాలయంలో చర్చలకు రావాలని మమతాబెనర్జీ ఆహ్వానించినట్లు సమ్మెలో భాగంకాని సీనియర్ డాక్టర్ సుకుమార్ ముఖర్జీ తెలిపారు. శనివారం సాయంత్రం వరకు గడువు ఇచ్చారని పేర్కొన్నారు. ముఖర్జీతో పాటు మరికొంత మంది ముఖ్యమంత్రిని కలిసి సుమారు రెండున్నర గంటల పాటు చర్చలు జరిపారు. నలుగురు జూడాలను చర్చలకు ఆహ్వానించాలని వైద్య విద్య సంచాలకులు ప్రదీప్ మిత్రాను కోరారు ముఖర్జీ.
చర్చలకు వచ్చేది లేదు..
రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానాన్ని తిరస్కరించారు జూనియర్ డాక్టర్లు. ఇది తమలోని ఐక్యత, నిరసనలను విచ్ఛిన్నం చేసేందుకు చేసే చర్యకు పేర్కొన్నారు. సచివాలయంలో ఎలాంటి సమావేశానికి హాజరయ్యేది లేదని తేల్చిచెప్పారు. ఎన్ఆర్ఎస్ వైద్య కళాశాల వద్దకు ముఖ్యమంత్రి వచ్చి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.