లైంగిక వేధింపుల కేసుల్లో బాధితురాలితో రాఖీ కట్టించుకోవాలని నిందితుడిని ఆదేశించడాన్ని ఒక నాటకంగా అభివర్ణించారు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్. లింగ సున్నితత్వాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఇలాంటి కేసుల్లో బెయిల్ మంజూరు చేసే క్రమంలో ముఖ్యంగా వాస్తవాలపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతపై న్యాయమూర్తులకు అవగాహన కల్పించటం అవసరమని సూచించారు.
లైంగిక వేధింపుల కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు నిందితుడికి బెయిల్ ఇస్తూ బాధితురాలితో రాఖీ కట్టించుకోవాలనే షరతు విధించడంపై దాఖలైన పిటిషన్ను విచారించింది జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం. ఈ సందర్భంగా తన వాదనలు వినిపించారు అటార్నీ జనరల్.
" లింగ సున్నితత్వం కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇలాంటి కారణాలతో బెయిల్ ఇవ్వటం సరికాదని జాతీయ న్యాయ అకాడమీ, రాష్ట్ర అకాడమీలు బోధించాలి. న్యాయమూర్తుల నియామక పరీక్షల్లోనూ లింగ సున్నితత్వంపై ఓ విభాగం ఉండాలి. లైంగిక వేధింపుల కేసులో బాధితురాలితో రాఖీ కట్టించుకోవాలని చెప్పడం పూర్తిగా నాటకం. న్యాయమూర్తులు వాస్తవ విషయాలపై దృష్టి పెట్టాలి. న్యాయ అకాడమీల్లో ఉన్నత న్యాయస్థానాల తీర్పుల గురించి బోధించాలి."