కర్ణాటక సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న కాంగ్రెస్-జేడీ(ఎస్) కూటమి.. ముఖ్యమంత్రి కుమారస్వామిపై పూర్తి విశ్వాసం ప్రకటించింది. శుక్రవారం సమావేశమైన కేబినెట్ కుమారస్వామి ఆధ్వర్యంలో కూటమి కొనసాగుతుందని స్పష్టం చేసింది.
"ముఖ్యమంత్రి కుమారస్వామి నాయకత్వంపై మాకున్న పూర్తి విశ్వాసం, నమ్మకాన్ని పునరుద్ఘాటించాం. ఈ రోజు నిర్వహించిన సమావేశంలో మంత్రులందరం తీసుకున్న నిర్ణయమిది."-జి పరమేశ్వర, కర్ణాటక ఉపముఖ్యమంత్రి
లోక్సభ ఎన్నికల ఫలితాలు కేంద్రం పనితీరుకు సంబంధించినవని, రాష్ట్రంలో ప్రజాతీర్పు కూటమి ప్రభుత్వానికే అనుకూలంగా ఉందని ఉపముఖ్యమంత్రి జి. పరమేశ్వర తెలిపారు. కర్ణాటకలో తమ సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి భయం లేదని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి భాజపా చేస్తున్న దుష్ప్రయత్నాలు సఫలం కానీయబోమని స్పష్టంచేశారు.