దేశవ్యాప్తంగా ఆదివారంతో జేఈఈ మెయిన్స్ పరీక్షలు ముగిశాయి. ఇక వైద్య విద్య ప్రవేశాల కోసం ఈ నెల 13న జరగనున్న నీట్‌పై దృష్టి సారించింది జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ).
అయితే జేఈఈ లాగా నీట్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష కాదు. విద్యార్థులు పెన్, పేపర్‌తో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. కరోనా సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని.. భౌతిక దూరం నిబంధనను పాటిస్తూ పరీక్షలు రాసేవిధంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రాల సంఖ్యను 2,546 నుంచి 3,843కు పెంచారు. ఒక గదిలో 24 మంది అభ్యర్థులకు బదులు 12మంది మాత్రమే కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు.
"భౌతిక దూరాన్ని పాటించే విధంగా పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు ప్రవేశించడం, తిరిగి వెళ్లడం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాం. పరీక్షా కేంద్రాల బయట ఉండేటప్పుడు కూడా భౌతిక దూరాన్ని పాటించే విధంగా తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. భౌతిక దూరం పాటించడం కోసం తీసుకోవాల్సిన చర్యలు, చేయకూడని పనులనుద్దేశించి రూపొందించిన మార్గదర్శకాలను ఇప్పటికే అభ్యర్థులకు అందించాం. వీరు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత ప్రభుత్వాధికారులకు సూచించాం."