వాస్తవాధీన రేఖ వద్ద భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంపై డ్రాగన్ నుంచి తొలి స్పందన వచ్చింది. ఏకపక్షంగా సరిహద్దులు దాటడం వంటి చర్యలతో పరిస్థితిని సంక్లిష్టం చేయవద్దని కోరింది. భారత్-చైనా సరిహద్దుల్లో సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ చోటు చేసుకోవడంపై ఈ మేరకు స్పందించింది. ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. ‘‘భారత దళాలు సరిహద్దులను ఇరుదేశాల నిర్ణయాన్ని ఉల్లంఘించి రెండుసార్లు సరిహద్దులు దాటి చైనా సైనికులను రెచ్చగొట్టాయి. దీంతో తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకొంది. భారత్ చైనాలు సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకొని వాస్తవాధీన రేఖ వెంట శాంతిని కొనసాగించేందుకు అంగీకరించాయి’’ అని చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యి పేర్కొనట్లు గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.
రాజ్‌నాథ్ రెండుసార్లు భేటీ
భారత్ వైపు నుంచి ఈ ఘటనపై ఎవరూ స్పందించలేదు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీవ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జయశంకర్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాల చీఫ్‌ల నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. సరిహద్దులో పరిస్థితిని సమీక్షించేందుకు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్, త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, సైనికాధికారి నరవాణెతో ఇవాళ రెండుసార్లు భేటీ అయ్యారు రాజ్‌నాథ్ సింగ్.
ముగ్గురు మృతి
సరిహద్దుల్లో భారత్-చైనా సైనికులు సోమవారం బాహాబాహీకి దిగారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్ స్థాయి అధికారితో పాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న క్రమంలో లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు.