దేశంలో ఎమర్జెన్సీ విధించి 45 ఏళ్లు అవుతున్న సందర్భంగా కాంగ్రెస్, భాజపా మధ్య మాటలయుద్ధం నడిచింది. ఎమర్జెన్సీ పాపం కాంగ్రెస్‌దేనంటూ విమర్శనాస్త్రాలు సంధించింది భాజపా. కాంగ్రెస్ ఇప్పటికీ ఎమర్జెన్సీ నాటి ఆలోచనాధోరణినే కలిగి ఉందని.. ఒకే కుటుంబం ప్రయోజనాలకు అక్కడ గౌరవం ఉందని ఆరోపించింది. కేంద్రంలో వ్యక్తిస్వామ్యం నడుస్తోందని దీనికి కాంగ్రెస్ జవాబిచ్చింది.
ప్రధాని విమర్శలు..
ఎమర్జెన్సీ విధింపుపై తరచూ పదునైన విమర్శలు చేస్తారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. అయితే అత్యయిక స్థితి విధించి 45 ఏళ్లయిన సందర్భంగా కాంగ్రెస్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీపై పోరాడిన నాటి నేతలకు వందనాలు చెబుతున్నట్లు ట్విట్టర్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
కాంగ్రెస్‌లో ఇప్పటికీ ఎమర్జెన్సీ..
కాంగ్రెస్ నేతలు చాలామంది పార్టీలో ఇమడలేకపోతున్నారని పేర్కొన్నారు అమిత్‌షా. ఇప్పటికీ ఎమర్జెన్సీ నాటి ఆలోచనా ధోరణినే కాంగ్రెస్ అగ్రనేతలు కలిగి ఉన్నారని వ్యాఖ్యానించారు.
"45 ఏళ్ల కిందట ఇదే రోజు ఒక కుటుంబం అధికార దాహం వల్ల దేశంలో ఎమర్జెన్సీని అమలు చేశారు. రాత్రికి రాత్రే దేశం జైలుగా మారింది. మీడియా, కోర్టులు, భావ ప్రకటనా స్వేచ్ఛను నలిపేశారు. పేదలు, అణగారిన వర్గాలపై దాడులు జరిగాయి."
- అమిత్‌షా ట్వీట్
లక్షలమంది ప్రజల పోరాటంతో దేశంలో ఎమర్జెన్సీని ఎత్తేశారని.. అయితే ఇప్పటికీ కాంగ్రెస్‌లో ఎమర్జెన్సీ కొనసాగుతోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు షా.
ఇప్పటికీ ఒక్క కుటుంబం కోసమే..
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఒక కుటుంబ ప్రయోజనాలను కాపాడేందుకే కృషి చేస్తుందన్నారు సమాచార, ప్రసార శాఖమంత్రి ప్రకాశ్ జావడేకర్. 45 ఏళ్ల కిందట ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వారు.. ప్రస్తుతం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. నాడు వ్యవస్థలన్నింటినీ కాంగ్రెస్ నాశనం చేసిందని.. విపక్షాల స్వేచ్ఛను హరించిందని పేర్కొన్నారు. అయితే అదే పార్టీ ప్రస్తుతం స్వేచ్ఛ కావాలని నినాదాలు చేస్తోందన్నారు.
'ఎమర్జెన్సీ నుంచి నేర్చుకోనిద్దాం..'
నాటి అత్యవసర పరిస్థితి నుంచి కొత్త తరాలను సరైన పాఠాలను నేర్చుకోనిద్దామని పేర్కొన్నారు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. నాటి ఎమర్జెన్సీ విధింపు పూర్తిగా అప్రజాస్వామికమని చెప్పారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశప్రజలు చేసిన త్యాగాలను గుర్తుచేసుకోవాల్సిన దినమని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రతి విమర్శలు..
భాజపా నేతలు చేస్తున్న విమర్శలపై దీటుగా స్పందించింది కాంగ్రెస్ పార్టీ. కేంద్ర ప్రభుత్వాన్ని ఇద్దరు మాత్రమే నడిపిస్తున్నారని పేర్కొంది. అధికార భాజపా కొనుగోలు రాజకీయాలు ఎందుకు చేస్తుందో సమాధానం చెప్పాలన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా.
రణ్‌దీప్ సుర్జేవాలా ట్వీట్
అప్రకటిత ఎమర్జెన్సీ..
ప్రధాని మోదీ దేశంపై అప్రకటిత ఎమర్జెన్సీ విధించారన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. గత ఆరేళ్లుగా ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామిక వ్యవస్థలను బలహీనపరిచేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
అత్యయిక స్థితి గుర్తుచేసేది అదే..
ప్రజాస్వామ్యానికి సవాళ్లు ఎదురైతే స్థిరంగా నిలబడాలని ఎమర్జెన్సీ గుర్తుచేస్తుందన్నారు మిళింద్ దిఓరా. ఇది అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుందన్నారు.
ఇదీ చూడండి:వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మరవదు: మోదీ