ఇక యూపీ మంత్రులూ ఆదాయ పన్ను కట్టాల్సిందే..! ఉత్తర్ప్రదేశ్లో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, డిప్యూటీ మంత్రుల ఆదాయపన్నును ఎప్పటినుంచో ప్రభుత్వమే చెల్లిస్తూ వస్తోంది. 1981 నుంచి ఈ విధానం అమల్లో ఉంది. అయితే.. తాజాగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనికి అవకాశం కల్పించే అలవెన్సుల చట్టాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి వీరి ఆదాయపన్నును ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించకూడదని నిర్ణయించారు. ఫలితంగా.. సుమారు 40 ఏళ్ల తర్వాత యూపీ మంత్రులు ఇన్కం ట్యాక్స్ వారే స్వయంగా చెల్లించనున్నారు.
మిగిలిన ప్రజలు అందరూ తమ జీతాల మీద ఆదాయపన్నును వారే చెల్లిస్తుంటే.. సీఎం, మంత్రులకు ప్రత్యేక ప్రయోజనాలు ఎందుకనే ప్రశ్న తెరపైకి వచ్చింది. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది.
'జీతాలు పెరిగాయి.. అందుకే'
1981లో ఈ నిబంధన పెట్టినప్పుడు ముఖ్యమంత్రి వేతనం నెలకు రూ. 1000, మంత్రుల వేతనాలు రూ. 650గా ఉండేవి. అయితే...గడిచిన 38 సంవత్సరాల్లో మంత్రుల వేతనాలు 40 సార్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో వారి ఇన్కం ట్యాక్స్ ఇంకా ప్రభుత్వమే చెల్లించాలనుకోవడం సరికాదని యోగి ప్రభుత్వం అభిప్రాయపడింది.
19 మంది మారినా..
యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రుల ఆదాయపన్ను కింద ప్రభుత్వ ఖజానా నుంచి రూ.81లక్షలు చెల్లించగా ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. గతేడాది రూ. 86 లక్షలను చెల్లించారు.
1981 నుంచి ఇప్పటి వరకు 19 మంది ముఖ్యమంత్రులు మారారు. కానీ, చట్టంలో నుంచి ఆ నిబంధనను మాత్రం తొలగించలేకపోయారు. తాజాగా యోగి సంచలన నిర్ణయంతో ప్రత్యేకంగా నిలిచారు.