రజనీకాంత్ రాజకీయ పార్టీ ప్రారంభించే విషయమై చర్చించేందుకు చెన్నైలోని కోడంబాకం రాఘవేంద్ర కల్యాణ మండపంలో 'రజనీ మక్కల్ మంద్రమ్' నిర్వాహకులతో చర్చించారు. రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్ సంసిద్ధత వ్యక్తం చేసిన తర్వాత అభిమాన సంఘాల నేతలతో రజనీ మక్కల్ మంద్రమ్ అనే పేరుతో ఓ వేదిక ఏర్పాటు చేశారు. రజనీ మక్కల్ మంద్రమ్ నిర్వాహకులు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో రజనీకాంత్ రాజకీయ పార్టీ కోసం పనులు చేస్తున్నారు. గత మూడు సంవత్సరాల్లో నిర్వాహకులతో రజనీకాంత్ ఇప్పటివరకు మూడు సార్లు భేటీ అయ్యారు.
నిర్వాహకులతో భేటీ అనంతరం రజనీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ప్రారంభించే విషయాన్ని రజనీ మక్కల్ మంద్రమ్ నిర్వాహకులతో చర్చించినట్లు తెలిపారు. తమిళనాడులో రాజకీయ శూన్యత ఉందన్న రజనీకాంత్.. దాన్ని పూరించేందుకు కమల్ హాసన్‌తో కలిసి పని చేస్తారా అని విలేకరులు ప్రశ్నించగా.. అందుకు కాలమే సమాధానం చెబుతుందని బదులిచ్చారు.