తెలంగాణ

telangana

By

Published : Sep 5, 2019, 7:00 AM IST

Updated : Sep 29, 2019, 12:10 PM IST

ETV Bharat / bharat

గాంధీ 150 : ఉద్యమాలకు కొత్తబాట చూపిన మహాత్ముడు

ఉద్యమాలకు సరికొత్త బాటలు చూపారు మహాత్మాగాంధీ. హింసకు.. హింస పరిష్కారం కాదని.. శాంతి నెలకొనాలంటే.. అహింసే సరైన ఆయుధమని ప్రపంచానికి చాటిచెప్పారు. సంఘర్షణల పరిష్కారానికి అహింసాయుత పద్ధతిలో పాటుపడినప్పుడే ప్రపంచశాంతి వెల్లివిరుస్తుందని నిరూపించారు బాపూ.

గాంధీ 150 : ఉద్యమాలకు కొత్తబాట చూపిన మహాత్ముడు

ఆధునిక ప్రపంచంలో చాలామంది నాయకులు అద్భుతాలు చేశారు. కానీ.. కొద్ది మంది మాత్రమే కాలాన్ని మలుపు తిప్పే నిర్ణయాలతో విప్లవాత్మక ప్రభావం చూపారు. అలాంటి అద్భుత మహనీయుల్లో ముందు వరసలో ఉంటారు మహాత్మాగాంధీ. సత్యం, అహింసలే అస్త్రాలుగా రక్తం చిందని యుద్ధం చేసిన గాంధీజీ.. ఉద్యమాలకు కొత్తబాట చూపారు. దాదాపు 200 ఏళ్ళపాటు బ్రిటిష్‌ వలస రాజ్యంగా ఉన్న భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని అందించారు. ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు ఆనాడే గాంధీజీ పరిష్కారం చూపారు. వ్యక్తుల నుంచి దేశాల మధ్య ఏర్పడుతున్న విభేదాలు, సంఘర్షణల నివారణకు ఎన్నో పద్ధతులు సూచించారు. గాంధీజీ సిద్ధాంతాలు కాలాతీతం. వాటిని పాటిస్తే రక్తపాతం లేని ప్రపంచాన్ని చూడొచ్చు. శాంతియుత సమసమాజానికి నాంది పలకవచ్చు. అందుకు ప్రపంచం సిద్ధంగా ఉందా...?

మహాత్ముడు తనదైన శైలిలో ప్రజల్ని ఒక్కటి చేశారు. ప్రేరణ కల్పించారు. వరుస ఉద్యమాలతో స్ఫూర్తి నింపారు. సాధారణ వ్యక్తులను అసాధారణ ఉద్యమకారులుగా మలిచారు. సోక్రటీస్‌లోని జ్ఞానం, సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కనబరిచే వినయం, బుద్ధుడు ప్రదర్శించే మానవత్వం, వేలమంది ప్రజల్ని సమ్మోహనపరిచే లెనిన్‌ చాతుర్యం, పురాతన మనుషుల పవిత్రత.. అన్నీ మహాత్ముడిలో కనిపిస్తాయి. గాంధీజీ.. గొప్ప వ్యూహకర్త, ఆదర్శ నాయకుడు. విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పే బాపూజీ తీరు.. లక్షలమంది ప్రజల్ని కదిలించింది. మహాత్ముడి వస్త్రధారణ, జీవనశైలి సామాన్య జనాన్ని కదిలించింది. ఆయనను తమలో ఒకడిగా చూసుకున్నారు. జాతిపితపై సంపూర్ణ నమ్మకముంచిన ప్రజలు.. తమ సొంతవ్యక్తిగా గౌరవించారు.

హింస అనివార్యమవుతోంది..

ప్రస్తుతం చిన్న చిన్న సంఘర్షణలు సైతం ప్రమాదకరంగా మారుతున్నాయి. కొన్ని శక్తుల ఆసక్తి కాస్తా ఘర్షణకు దారితీస్తోంది. ఘర్షణ వ్యక్తిగత స్థాయి నుంచి జాతి, వర్గం, కులం, రాజకీయం, ప్రాంతీయం, జాతీయం, అంతర్జాతీయం ఏ స్థాయిలోనైనా ఉండొచ్చు. అసమ్మతి తీవ్రతే సంఘర్షణ. రెండుపార్టీలు ఒకదానినొకటి దెబ్బతీసుకునే రాజకీయమూ.. సంఘర్షణే. ఆధిపత్యం, అన్యాయం, దౌర్జన్యం, అపనమ్మకం, నిస్సహాయతలు.. సంఘర్షణ వైపు నడుపుతాయి.

హింసకు తావులేకుండా గాంధేయ పద్ధతుల్లో విభేదాలను పరిష్కరించుకోవాలన్న స్పృహను కోల్పోయినందుకే.. సంఘర్షణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ రోజుల్లో జ్ఞానం, మూర్ఖత్వం కలిసిపోతున్నాయి. చిల్లులుపడిన గొడుగు పట్టుకుని చినుకులు పడకుండా గడపొచ్చనే భ్రమలో ఉన్న వ్యక్తులు ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. మనలో చాలామంది ఆలోచనలు, హృదయం నిస్సారమైపోయాయి. అందుకే హృదయం లేని ప్రపంచం యాంత్రికంగా పరుగులు పెడుతోంది. ఎదుటి వ్యక్తి బాధను పట్టించుకోలేపోతోంది. ఆధిపత్యం అవసరమని భావిస్తున్న శక్తుల మధ్య.. హింస అనివార్యమవుతోంది.


20వ శతాబ్దం ప్రారంభం నుండి హింసే మాట్లాడుతోంది. అణుయుద్ధం ప్రపంచాన్ని భయపెడుతోంది. రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకి నగరాలపై అణుబాంబు దాడి జరిగింది. మూడో ప్రపంచయుద్ధం అంటూ వస్తే.. అది అణ్వాయుధాలు గల దేశాల మధ్యే జరుగుతుందనే వాదన ఉంది.

“మూడో ప్రపంచయుద్ధం ఎప్పుడు జరుగుతుందో కానీ..నాలుగో ప్రపంచయుద్ధం మాత్రం.. కర్రలు, రాళ్లతోనే జరుగుతుంది.” అని 1947లో ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ అన్నారు. మూడో ప్రపంచయుద్ధంలో ప్రపంచం సర్వ నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తొలి రెండు ప్రపంచ యుద్ధాలు మినహా చరిత్రలో జరిగిన దాదాపు 250 యుద్ధాల వల్ల 5 కోట్ల మందికి పైగా ప్రజలు మరణించారు.

రక్షణకే భారీ ఖర్చులు

హింస మన జీవన విధానంలో భాగమైపోయింది. తుపాకీ శబ్దాల మధ్య ఉదయించి, రక్తపాతంతో చీకటిపడే దేశాలు ప్రపంచవ్యాప్తంగా 40కిపైగా ఉన్నాయి. జీవితం సురక్షితమనే ధీమా లేదు. అన్ని దేశాల సైనిక వ్యయం 18 వందల 22 బిలియన్‌ డాలర్లు దాటిపోయింది. భారత రక్షణ వ్యయం 66.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. సైన్యంపై భారీగా ఖర్చుపెడుతున్న అమెరికా, చైనా, సౌదీ అరేబియాల తర్వాతి స్థానం మనదే. చైనా సైనికుల సంఖ్య 21 లక్షలు కాగా, 15 లక్షల జవానులు కలిగిన భారత్‌ తర్వాత స్థానంలో నిలిచింది. అభివృద్ధి చెందిన దేశాలు రక్షణ కోసం బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేస్తున్నాయి. అభివృద్ధి కోసం చేసే వ్యయం కంటే ఈ కేటాయింపులు 20 రెట్లు అధికంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా రక్షణ కోసం జరుగుతున్న వ్యయంలో 70 శాతం 6 దేశాలే చేస్తున్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు 15 శాతం రక్షణ కోసం ఖర్చు చేస్తున్నాయి.

జాతీయ భద్రత, ఉగ్రవాదంపై పోరాటం కోసం చేస్తున్న ఖర్చుల వల్ల ఆరోగ్యం, విద్య గృహనిర్మాణానికి కేటాయింపులు తగ్గిపోతున్నాయి. అణ్వాయుధాలు కలిగిన దేశాల వద్ద 14 వేల న్యూక్లియర్‌ వార్‌ హెడ్స్‌ఉన్నాయి. వీటితో ప్రపంచం మొత్తాన్ని కొన్ని వందల సార్లు నాశనం చేయొచ్చు. ఈ న్యూక్లియర్‌ వార్‌ హెడ్స్‌లో అమెరికా, రష్యా వద్దే 90 శాతానికి పైగా ఉన్నాయి. భారత్‌ వద్ద 140 న్యూక్లియర్‌ వార్‌ హెడ్స్‌ఉండగా.. దాయాది పాకిస్థాన్‌ 160 కలిగి ఉంది. భారత్‌, పాకిస్థాన్‌, చైనా.. కొత్త బాలిస్టిక్‌ క్షిపణి పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. ఇక పౌరులు తమ రక్షణ కోసమని లైసెన్సు కలిగిన తుపాకులు కలిగి ఉన్నారు. ఎలాంటి అనుమతులు లేని తుపాకులకు లెక్కేలేదు. ప్రపంచంలోని వంద కోట్ల తుపాకుల్లో... 85 శాతం పౌరుల చేతుల్లోనే ఉన్నాయి. అమెరికాలో ప్రతి వందమందికి 121 తుపాకులు ఉన్నాయి. జర్మనీలో వందమందికి 20, టర్కీలో 17, రష్యాలో 12, బ్రెజిల్‌లో 8, భారత్‌లో ఐదుగురు తుపాకులు కలిగి ఉన్నారు.

యుద్ధం అత్యంత అన్యాయం..

గాంధేయ భావజాలాన్ని అనుసరిస్తే.. వీటన్నింటి అవసరం ఉంటుందా..? శాంతి, సమభావన, అభివృద్ధే గాంధేయ సిద్ధాంతాల లక్ష్యం. గాంధేయ విధానం పోటీని నివారిస్తుంది. దూకుడు తగ్గిస్తుంది. శాంతియుత సహజీవనానికి బాటలు వేస్తోంది. ఆ విధానాలను అవలంబిస్తే.. ఒక దేశాన్ని చూసి... మరో దేశం చేస్తున్న రక్షణ వ్యయం కచ్చితంగా తగ్గేది.

మహాత్ముడి దృష్టిలో యుద్ధం అత్యంత అన్యాయమైనది. ఎట్టిపరిస్థితుల్లో సహించలేనిది. అహింసా, ధర్మ సూత్రాలకు అది పూర్తి విరుద్ధం. యుద్ధం కొందరి ఆధిపత్య శక్తుల సృష్టి అని గాంధీ భావన. ఆ కొందరు వ్యక్తులు తమ నిర్ణయాలతో లక్షల మంది ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విభేదాలు, సంఘర్షణలు, యుద్ధాలను నివారించేందుకు వ్యక్తిగతం నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు అవసరమైన నైతిక పరిష్కారాలు మనకు గాంధేయ భావజాలంలో కనిపిస్తాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలకు, హింసకు గాంధీజీ 70 ఏళ్ల క్రితమే పరిష్కారం చూపారు.

హింసకు హింస పరిష్కారం కాదు. శాంతి నెలకొనాలంటే.. అహింసే సరైన ఆయుధం. శత్రువు అంటూ ఎవరూ ఉండరు. విరోధులే ఉంటారు. విరోధాన్ని ఆధిపత్యం కాకుండా.. ఆత్మశక్తితోనే తొలగించకోగలం. సంఘర్షణల పరిష్కారానికి అహింసాయుత పద్ధతిలో పాటుపడినప్పుడే.. ప్రపంచశాంతి వెల్లివిరుస్తుంది. సామాజిక, జాతీయ, అంతర్జాతీయ ఉద్రిక్తతలకు అసలైన కారణం.. శాంతి లేకపోవడమే. ప్రజలను ఒక్కటి చేసే సానుకూల శక్తి.. శాంతి. యుద్ధం ఎప్పుడూ విడదీస్తుంది. అది ఎప్పటికీ ప్రపంచశాంతికి తోడ్పడదు.

“విభేదాలు మరచి, సంఘర్షణలకు తెరదించి.. నిర్మలమైన మనస్సుతో ఆలోచించే విశాలత్వం లేనంత వరకు ఈ ప్రపంచానికి శాంతి లేదు". మహాత్మాగాంధీ 150 జయంతోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న ప్రపంచం.. ఆయన భావజాలాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకుంటే.. మానవ వికాసం దిశగా మరో అడుగుపడినట్లే.
- (రచయత - ప్రొఫెసర్​ వి బాలమోహన్​దాస్​)

Last Updated : Sep 29, 2019, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details