కోర్టు తీర్పు వెలువడినందున ఇక అందరి దృష్టీ అయోధ్యలో రామమందిరం నిర్మాణంపైనే పడింది. మందిరం పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఎప్పట్లో పూర్తవుతాయి? అన్న విషయాలపై ఆసక్తి నెలకొంది. విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) రూపొందించిన నమూనా ప్రకారమయితే పనులు పూర్తికావడానికి దాదాపు అయిదేళ్లు పడుతుంది. కనీసం 250 మంది శిల్పులు నిరంతరాయంగా కృషి చేస్తేనే ఇది సాధ్యమవుతుంది.
ఇప్పటికే సగం పనులు పూర్తి
1990 నుంచే ఇక్కడ వీహెచ్‌పీ కార్యశాలను ప్రారంభించి పనులకు శ్రీకారం చుట్టింది. మందిరానికి 212 స్తంభాలు అవసరం కాగా, వాటిలో 106 స్తంభాల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మూడు దశాబ్దాలుగా చెక్కిన ఈ స్తంబాలు కింది అంతస్తు వరకు సరిపోతాయి. పై అంతస్తుకు అవసరమైన స్తంభాలు, ఇతర శిల్పాలను చెక్కాల్సి ఉంది. ఈ ఏడాది జులైలో ప్రధాన శిల్పి రజనీకాంత్ సోంపురా మరణించడంతో అప్పటి నుంచి పనులు ఆగిపోయాయి. ప్రస్తుతానికయితే కార్యశాలలో శిల్పులు ఎవరూ పనిచేయడం లేదు. పనులు మళ్లీ ప్రారంభం కావాలంటే 250 మంది శిల్పులు అవసరమవుతారని కార్యశాల సూపర్‌వైజర్ అన్నూభాయి సోంపురా అభిప్రాయపడ్డారు. ఆలయం పనులు పూర్తికావడానికి అయిదేళ్లు పడుతుందని అన్నారు. రాజస్థాన్ నుంచి శిలలను తీసుకురావాల్సి ఉంటుందని, శిల్పాలను తెల్లసిమెంట్‌తో అతికించాల్సి ఉందని వివరించారు. గర్భగుడికి గోడలు నిర్మించాల్సి ఉందని, పాలరాయితో ‘చౌకత్’లను చెక్కాల్సి ఉందని చెప్పారు. అన్నింటిలోనూ ఆలయ శిఖర నిర్మాణం కీలకమైనదని వివరించారు.