భారత వైమానికదళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్... మరోసారి మిగ్-21 విమానంలో యుద్ధ విన్యాసాలు చేశారు. పాక్ సేనకు చిక్కి, విడుదలైన అనేక నెలల తర్వాత తొలిసారిగా విమానాన్ని నడిపారు. పంజాబ్ పఠాన్‌కోట్ వైమానిక స్థావరం నుంచి వాయుసేన అధినేత బీఎస్ ధనోవాతో కలిసి ఆకాశ వీధుల్లో దూసుకెళ్లారు వర్ధమాన్.
వాయుసేన అధిపతిగా ధనోవా పదవీకాలం మరికొద్దిరోజుల్లో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో తన చివరి యుద్ధ విన్యాసాలు వర్ధమాన్‌తో చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ఆయన. అభినందన్ తండ్రితోనూ మిగ్-21లో యుద్ధ విన్యాసాలు చేసినట్లు గుర్తు చేసుకున్నారు ధనోవా.
"అభినందన్‌తో కలిసి ఆకాశ వీధుల్లోకి దూసుకెళ్లడం నాకు ఎంతో గర్వకారణం. 1998లో నేను కూడా పైలట్ విధులకు దూరమయ్యాను. తిరిగి విధుల్లో చేరేందుకు నాకు 9 నెలలు పట్టింది. అభినందన్ 6 నెలల కంటే తక్కువ సమయంలోనే తిరిగి వచ్చాడు. మిగ్-21 శిక్షకుడిగా మళ్లీ చేరాడు. అది ఎంతో గొప్ప విషయం. మా ఇద్దరికీ రెండు లక్షణాలు ఒకేలా ఉన్నాయి. అందులో మొదటిది... ఇద్దరం విధులకు దూరమయ్యాం. రెండవది ఇద్దరం పాకిస్థాన్‌పై పోరాడాం. నేను కార్గిల్‌లో, అభినందన్ బాలాకోట్‌లో శత్రువులపై యుద్ధం చేశాం. నా చివరి యుద్ధ విన్యాసాలు ఒక యోధుడితో చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది."
- బీఎస్ ధనోవా, వాయుసేన అధిపతి