తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇది కొండ అనుకుంటారేమో.. కానే కాదు! - అతిపెద్ద గార్బేజ్​

సాధారణంగా నగరాల్లోని చెత్తను సేకరించి డంప్ యార్డుల్లో పోస్తారు. అక్కడ చెత్త నిండితే.. రీసైక్లింగ్​ చేయడమో, దహనం చేయడమో లాంటివి చేస్తుంటారు. అయితే దేశరాజధానిలో 'చెత్త రికార్డు'ను నెలకొల్పేందుకు ఓ డంపింగ్‌ యార్టు ఏకంగా.. పేద్ద కొండలా తయారైంది. ఆ చెత్తగుట్టను తరలించేందుకు అధికారులు కొన్నేళ్లుగా చేస్తున్న చర్యలు అంతంతమాత్రంగానే కొనసాగుతున్నాయి.

a dump yard became as a mountain in delhi and people are facing problems with that dump yard
ఇది కొండ అనుకుంటారేమో.. కానే కాదు!

By

Published : Nov 23, 2020, 11:48 AM IST

Updated : Nov 23, 2020, 12:16 PM IST

ఇది కొండ అనుకుంటారేమో.. కానే కాదు!

దేశ రాజధాని దిల్లీలోని ఓ గుట్టను దూరం నుంచి చూస్తే సహజసిద్ధంగా ఏర్పడిందేమోనని అనిపిస్తుంది. కానీ, కాస్త దగ్గరికి వెళ్లి చూస్తే ఆ కొండ చరిత్ర ఏంటో అర్థం అవుతుంది. ఎందుకంటే.. అది నిజంగా కొండ కాదు ఓ భారీ చెత్తకుప్ప. దిల్లీలోని చెత్తను దశాబ్దాలుగా ఘాజీపుర్​లో పోగుచేయగా ఈ చెత్త కొండ ఏర్పడింది.

కొండలా మారిన డంపింగ్​ యార్డ్​

మారిన జీవన విధానంతో..

1984లో దిల్లీలోని చెత్తను వేయడానికి ఘాజీపుర్​లో 40 ఫుట్ బాల్ మైదానాలంత వెడల్పు గొయ్యి తవ్వారు. అందులో పాత దిల్లీ సహా నగరంలోని పలు ప్రాంతాల నుంచి చెత్తను తెచ్చి డంప్ చేసేవారు. రెండు దశాబ్దాల పాటు అంతా సాఫీగానే జరిగింది. నగరం విస్తరణ, మారిన జీవన విధానం, పారేసే ప్లాస్టిక్ వినియోగం పెరగడం వల్ల 2002లో తీసిన గొయ్యి చెత్తతో నిండిపోయింది. తర్వాత.. ఈ డంప్ యార్డులో కొన్ని మీటర్ల ఎత్తు వరకు చెత్తను వేసేందుకు అనుమతులు ఇచ్చుకుంటూ వచ్చారు.

ప్రస్తుతం ఈ డంప్ యార్డులో 25 మీటర్ల ఎత్తుకు మించి చెత్త వేయ్యరాదని ఆదేశాలు ఉన్నా... గతేడాది గణాంకాల ప్రకారం ఇప్పుడున్న ఈ చెత్తగుట్ట ఎత్తు 213 అడుగులుగా ఉంది. ఇది తాజ్ మహల్ ఎత్తు 239.5 అడుగులను దాటేస్తుందన్న అంచనాలు రెండేళ్ల కిందటే వచ్చాయి.

ప్రమాదాలకు అడ్డాలా..

దిల్లీ నుంచి రోజుకు రెండు వేల టన్నుల చెత్తను ట్రక్కుల్లో తీసుకొచ్చి పోస్తూ వచ్చారు. అందుకే.. అది ఏటా 33 అడుగుల చొప్పున ఎత్తు పెరిగిపోయింది. కొండచరియలు విరిగిపడినట్లు 2018లో భారీ వర్షాలకు చెత్తగుట్ట కొంతభాగం విరిగిపడితే.. ఇద్దరు మరణించారు. అప్పటి నుంచి ఇక్కడ చెత్త వేయకూడదని నిర్ణయం తీసుకున్నా.. మరో ప్రత్యామ్నాయ స్థలం లేక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

ఘాజీపుర్​ డంపింగ్​ యార్డ్​

ఇందులో నుంచి వెలువడే మీథేన్ వంటి వాయువులకు ఉండే.. మండే స్వభావంతో తరచూ మంటలు చెలరేగుతుంటాయి. రాజధానిలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే టన్నులకొద్ది వ్యర్థాలతో పేరుకుపోయిన ఈ కొండను కరిగించాలన్న చర్యలు మాత్రం అంతంత మాత్రంగానే సాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

"25 ఏళ్లుగా ఇక్కడ చెత్త వేయడాన్ని చూస్తున్నాం. దీని వల్ల ఇక్కడ రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఇక్కడ నివసించడం కష్టమవుతోంది. ఏ ప్రభుత్వమూ దీన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోలేదు. దీన్ని తొలగించాలి."

--స్థానికుడు

"రాజకీయ నేతలు దీన్ని తొలగిస్తామన్నారు. కానీ తొలగించలేదు. పెద్ద పెద్ద నాయకులు ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించి వెళ్తారు. ఈ చెత్తకుప్ప వల్ల దుర్వాసన వస్తోంది. రోగాలు వస్తున్నాయి. కానీ దీని గురించి ప్రభుత్వాలు ఆలోచించడం లేదు."

--స్థానికుడు.

విమానాలకు అడ్డు వస్తుందేమోనని..

2018 నుంచి కోర్టులు, ఎన్జీటీ ఆదేశాలతో దిల్లీ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఆ కొండ విమానాలకు అడ్డు వస్తుందేమోనన్న సుప్రీంకోర్టు.. దానిపై ఎర్ర దీపాలు పెట్టాలని గతంలో ఆదేశించిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు, ఎన్జీటీ ఆదేశాల తర్వాత.. గతేడాది నుంచి కాస్త చెత్తను ఇక్కడ వేయడం తగ్గించి, నగర శివారుల్లోని పలు ఖాళీ ప్రాంతాల్లో డంప్ యార్డులను ఏర్పాటు చేశారు.

ఘాజీపుర్​ డంపింగ్​ యార్డ్​

అయితే.. ప్రస్తుతం జరుగుతున్న ఘన వ్యర్థాల నిర్వహణ చర్యలతో.. ఇక్కడున్న భారీ కొండను తరిగించడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనపడటం లేదని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇలాంటి చెత్త కొండలు పేరకుపోకుండా ఉండాలంటే.. వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించాలని, పునర్వినియోగానికి వ్యర్థాల నిర్వహణ యూనిట్లను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు.

ఇదీ చూడండి:జుట్టుకు ఎరుపు రంగు వేసుకుంటే కరోనా రాదా?​

Last Updated : Nov 23, 2020, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details