"ప్రభుత్వం పనితీరుపై, మోదీ-ఆర్ఎస్ఎస్ తీరుపై దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రజలకు అనుమానాలున్నాయి. తమ సంప్రదాయం, భాష, చరిత్రపై దాడి జరుగుతోందని దేశంలోని చాలా మందికి అనిపిస్తోంది. అందుకే దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి పోటీ చేసి వారికి ఒక సందేశం ఇవ్వాలనుకున్నా."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు.
వయనాడ్ లోక్‌సభ స్థానానికి నామపత్రం దాఖలు చేసిన తర్వాత కేరళ రాజకీయాలపై స్పందించారు రాహుల్. ఎన్నో ఏళ్లుగా రాష్ట్రంలో సీపీఎం- కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉందన్నారు. సీపీఎం ఎన్ని విమర్శలు చేసినా తాను మాత్రం ఎన్నికల ప్రచారాల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రసంగించనని రాహుల్ స్పష్టం చేశారు.
రాహుల్... రాహుల్...
వయనాడ్‌లో నామపత్రం దాఖలు చేసిన అనంతరం రోడ్‌షో నిర్వహించారు రాహుల్. ప్రియాంక గాంధీ సహా పార్టీ ముఖ్యనేతలు ఇందులో పాల్గొన్నారు. తమ ప్రియతమ నాయకుడిని చూడటానికి రాహుల్ అభిమానులు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ జెండాల రెపరెపలతో, రాహుల్ గాంధీ అనే నినాదాలతో వయనాడ్ రోడ్లు హోరెత్తాయి.