అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు కేసులో సుప్రీం ఇచ్చిన చారిత్రక తీర్పుపై రివ్యూ కోరే విషయంలో వెనక్కి తగ్గేది లేదని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్ తేల్చిచెప్పింది. డిసెంబర్ 9లోపు పునర్విచారణ వ్యాజ్యం దాఖలు చేస్తామని ఇంతకుముందే ప్రకటించినట్లు ప్రస్తావించింది.
దేశంలోని 99 శాతం మంది ముస్లింలు... సుప్రీం కోర్టు తీర్పుపై రివ్యూ కోరుకుంటున్నారని స్పష్టం చేసింది బోర్డ్.
"ముస్లింలకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. అందుకే రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తున్నాం. అయితే అయోధ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు ఆ నమ్మకాన్ని సన్నగిల్లేలా చేసింది. పిటిషన్ కొట్టివేస్తారు అని దాఖలు చేయకుండా ఉండం కదా. రివ్యూ పిటిషన్ కోరడం చట్టబద్ధమైన హక్కు. సుప్రీం ఇచ్చిన తీర్పులో కొన్ని పరస్పర విరుద్ధ అంశాలు ఉన్నాయి." - మౌలానా వలీ రహ్మానీ, ఎఐఎమ్పీఎల్బీ ప్రధాన కార్యదర్శి