వైరస్‌ల ద్వారా సంక్రమించే స్వైన్‌ఫ్లూ, కొవిడ్-19లు అత్యధికంగా 12 రాష్ట్రాల్లోనే వ్యాప్తి చెందుతున్నాయి. పెరుగుతున్న జనసాంద్రత తదితర కారణాలతోనే ఇక్కడ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత మూడేళ్లలో స్వైన్‌ఫ్లూ ప్రబలిన తీరు, ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతోంది.
దేశంలో 72 శాతం జనాభా ఈ రాష్ట్రాల్లోనే ఉండగా 92 శాతానికి పైగా కేసులు ఇక్కడే నమోదయ్యాయి. దేశ రాజధాని దిల్లీతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలన్నీ ఇందులో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో కొన్ని సారూప్యతలు కూడా కనిపిస్తున్నాయి.
- జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం(ఎన్‌సీడీసీ) గణాంకాల ప్రకారం గత మూడేళ్లలో దేశవ్యాప్తంగా 82,875 స్వైన్‌ఫ్లూ కేసులు బయటపడగా.. అందులో 92.08% (76,316 కేసులు) ఈ 12 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి.
- దేశవ్యాప్తంగా మంగళవారం సాయంత్రం 7 గంటల వరకు 18,985 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 92.89%(17,637 కేసులు) ఈ రాష్ట్రాల్లోనే బయటపడ్డాయి.
దేశంలో కరోనా విస్తరణ వేగం స్వైన్‌ఫ్లూ కంటే అధికంగా ఉన్నప్పటికీ.. మరణాల రేటు స్వైన్‌ఫ్లూలోనే ఎక్కువగా ఉంది. గత మూడేళ్లలో స్వైన్‌ఫ్లూ సోకిన వారిలో 5.56 శాతం(4,616 మంది) మంది చనిపోయారు. కరోనా వ్యాప్తి చెందిన తరువాత మంగళవారం సాయంత్రం వరకు 3.17 శాతం(603 మంది) ప్రాణాలు కోల్పోయారు.