గుజరాత్‌లోని కేవాడియాలో ఉన్న ఐక్యతా విగ్రహం సమీపంలో బుధవారం నుంచి రెండు రోజుల పాటు 80వ అఖిలభారత స్పీకర్ల సదస్సు జరగనుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సదస్సును ప్రారంభించి సందేశం ఇస్తారు. ప్రధాని మోదీ గురువారం ముగింపు కార్యక్రమంలో మాట్లాడతారు.
రాజ్యాంగ దినోత్సవాన్ని(నవంబరు 26) పురస్కరించుకొని 'శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య సమన్వయమే శ్రావ్యమైన ప్రజాస్వామ్యానికి కీలకం' అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గుజరాత్, రాజస్థాన్ గవర్నర్లు, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధురి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తదితరులు సదస్సులో పాల్గొంటారు. ఇప్పటివరకు 27 రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, అధికారులు సదస్సుకు హాజరవుతున్నట్టు ఖరారైంది. కాగా ఈ సదస్సుకోసం ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం కేవాడియా చేరుకుని ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
ఇదీ చదవండి:కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కన్నుమూత