దేశంలో 80శాతం మంది పౌరులు టీకా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని ఓ అంతర్జాతీయ సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. 28 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో భారత్ తొలిస్థానంలో నిలిచింది. రష్యాలో 15 శాతం మంది మాత్రమే టీకా తీసుకునేందుకు మొగ్గుచూపుతుండగా.. అమెరికాలో 33 శాతం మంది ఇందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది.
అక్టోబర్ 19 నుంచి నవంబర్ 18 మధ్య 33 వేల మందిపై ఈ సర్వే నిర్వహించింది ఈడెల్మన్ సంస్థ. వ్యాక్సిన్ విడుదలైన వెంటనే స్వీకరించేందుకు 51 శాతం మంది మొగ్గుచూపగా.. 29 శాతం మంది ఏడాది లోపు తీసుకుంటామని తెలిపారు.
విశ్వాసం తగ్గింది..
2020 ప్రథమార్ధం తర్వాత వైద్య రంగం విషయంలో ప్రభుత్వాలపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని సర్వే పేర్కొంది. మొత్తంగా ప్రభుత్వాలపై నమ్మకం 8పాయింట్ల మేర తగ్గినట్లు తెలిపింది. అదేసమయంలో భారత్లో సర్కారుపై నమ్మకం రెండు పాయింట్లు క్షీణించి 79 శాతానికి చేరిందని వెల్లడించింది. అయితే వ్యాపార రంగంపై విశ్వాసానికి మాత్రం డోకా లేదని స్పష్టం చేసింది. రికార్డు సమయంలో టీకాను అందుబాటులోకి తేవడం, కరోనా సమయంలోనూ కార్యకలాపాలు కొనసాగేలా ప్రయత్నించడం వల్ల ఈ రంగం నమ్మకాన్ని చూరగొందని తెలిపింది.