పెద్దల సభ అయిన రాజ్యసభలో 73 స్థానాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత సభ్యుల్లో 69 మంది పదవీ కాలం ఈ ఏడాదే పూర్తికానుందని.. రాజ్యసభ సచివాలయం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరో నాలుగు సీట్లు ఇప్పటికే ఖాళీగా మారాయి. పదవీకాలం పూర్తికానున్న వారిలో భాజపా నుంచి 18 మంది, కాంగ్రెస్ నుంచి 17 మంది సభ్యులుగా ఉన్నారు. కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, రామ్‌దాస్ అథవాలేలతో పాటు సీనియర్ నేతలు శరద్ పవార్, దిగ్విజయ్ సింగ్, విజయ్ గోయల్ ఈ జాబితాలో ఉన్నారు.
రాజ్యసభలో మెజారిటీ దిశగా భాజపా పయనిస్తున్న నేపథ్యంలో 2018- 19 సంవత్సరాల్లో పలు శాసనసభ ఎన్నికల్లో ఓటమి కమలం పార్టీకి అవాంతరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కారణంగా ఎలాంటి అదనపు ప్రయోజనం భాజపాకు వచ్చే అవకాశం కన్పించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ కూటమి పార్టీలు ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో మెరుగయ్యాయి. ఈ నేపథ్యంలో రానున్న రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ సహా మిత్రపక్ష పార్టీలకు లాభించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాజ్యసభలోని 250 మంది సభ్యుల్లో భాజపా నుంచి 83 మంది, కాంగ్రెస్ నుంచి 46 మంది సభ్యులు ఉన్నారు.
యూపీలో మెజారిటీ స్థానాలు భాజపావే..