ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై ఇక నుంచి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ. ఈ మేరకు 'మోటారు వాహన చట్టం-2019'లోని 63 నిబంధనలను సెప్టెంబరు 1నుంచి అమలు చేయనున్నట్టు వెల్లడించారు.
ఈ నిబంధనల ప్రకారం డ్రంకన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడింగ్ వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే అధిక పెనాల్టీలు విధించనున్నట్లు స్పష్టం చేశారు గడ్కరీ. రోడ్డు రవాణా, రహదార్ల శాఖ నూతన వెబ్సైట్ను దిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
మోటారు వాహన చట్టంలోని నిబంధనలను పరిశీలన కోసం న్యాయశాఖకు పంపినట్లు చెప్పారు గడ్కరీ. నాలుగు రోజుల్లోగా అంగీకారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదాలకు రోడ్ల నిర్మాణంలో డిజైన్ల లోపాలే ప్రధాన కారణమని గడ్కరీ అన్నారు. రూ.14వేల కోట్లతో ప్రమాదకర ప్రాంతాలను గుర్తించే ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు.
అమలు కానున్న కఠిన నిబంధనలు
- లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500లు ఉండే జరిమానాను రూ.5వేలకు పెంచారు.
- అతివేగంగా వాహనం నడిపితే రూ.400ల నుంచి రూ.1000కు పెంచారు.
- ప్రమాదకర డ్రైవింగ్ చేస్తే రూ.1000 వరకు ఉన్న జరిమానాను...రూ.5వేలకు పెంచేశారు.
- మద్యం తాగి వాహనం నడిపితే రూ.2వేలు ఉంటే దాన్ని రూ.10వేలకు పెంచారు.
- సీటు బెల్టు లేకుండా వాహనం నడిపితే రూ.100 నుంచి రూ.1000కి పెంచారు.
ఇదీ చూడండి: త్వరలో అమల్లోకి మోటారు వాహన చట్ట సవరణ