పౌర నిరసన: 70 లక్షల మందితో 620కి.మీ మానవహారం పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ)ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కేరళలో 620 కి.మీ భారీ మానవహారం నిర్మించారు. కేరళ ఉత్తర భాగంలోని కాసరగోడ్ నుంచి దక్షిణాన ఉన్న కాళియక్కవిలై వరకు ప్రజలు మానవహారంగా ఏర్పడి వినూత్న రీతిలో తమ నిరసనను తెలిపారు.
అమలు చేసేది లేదు
అధికార సీపీఎం నేతృత్వంలో వామపక్ష ప్రజాస్వామ్య కూటమి(ఎల్డీఎఫ్) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ నేత కనమ్ రాజేంద్రన్.. తిరువనంతపురంలో జరిగిన నిరసనలో పాల్గొన్నారు. కేరళలో సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను అమలుచేసేది లేదని పినరయి విజయన్ తేల్చిచెప్పారు. ఇవి లౌకికవాదానికి గొడ్డలిపెట్టని వ్యాఖ్యానించారు.
భారీ మానవహారం
సీఏఏకు వ్యతిరేకంగా కేరళలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రజలు మానవహారంగా ఏర్పడ్డారు. కాసరగోడ్ వద్ద మొదలైన ఈ మానవహారంలో మొదటి వ్యక్తిగా సీపీఎం సీనియర్ నేత ఎస్ రామచంద్రన్ పిళ్లై ఉండగా... కాళియక్కవిళైలో చివరి వ్యక్తిగా మరో నేత ఎంఏ బేబీ ఉన్నారు.
అన్ని వర్గాల ప్రముఖులు ఈ నిరసనలో పాల్గొన్నారు. రాజ్యాంగ పీఠికను చదివి... రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడతామని ప్రమాణం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మానవహారంలో సుమారు 60 నుంచి 70 లక్షల మంది పాల్గొని... సీఏఏకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారని ఎల్డీఎఫ్ తెలిపింది.
ఇదీ చూడండి: సముద్రగర్భంలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం