ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్‌లోని టప్పల్ ప్రాంతంలో జరిగిన రెండున్నరేళ్ల చిన్నారి హత్య కేసులో పోలీసుల తీరుపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజానీకం డిమాండ్ చేస్తోంది. అరెస్టు చేసిన ఇద్దరితో పాటు వారి కుటుంబ సభ్యులనూ శిక్షించాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. హత్యలో వారికీ సంబంధం ఉందని ఆరోపించారు.
సిట్ ఏర్పాటు
ఈ విషయంపై జాతీయ భద్రత చట్టం కింద చర్యలు తీసుకుంటామని అలీగఢ్ సీనియర్ ఎస్పీ ఆకాశ్ కుల్హరి తెలిపారు. కేసు దర్యాప్తునకు ఆరుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేసు విచారణకు ఒక మహిళా పోలీసును నియమించామని తెలిపారు.
ఐదుగురిపై వేటు..
బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ.. కేసు నమోదు చేయటంలో అశ్రద్ధ వహించిన ఐదుగురు పోలీసులపై వేటు వేశారు అధికారులు.
నివేదిక ఇవ్వాలని ఆదేశం...
చిన్నారి హత్యపై నివేదికను అందించాలని అలీగఢ్ ఎస్ఎస్పీని ఆదేశించింది జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్.
రాహుల్ గాంధీ విచారం..
బాలిక హత్యపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యూపీ పోలీసులు విచారణ వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడేలా చేయాలని సూచించారు. చిన్నారి హత్యను తీవ్రంగా ఖండించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. తల్లిదండ్రుల బాధ ఊహాతీతమని పేర్కొన్నారు.
ఇదీ జరిగింది...
ఉత్తర్‌ప్రదేశ్ అలీగఢ్‌లోని టప్పల్ ప్రాంతంలో అప్పు చెల్లించలేదనే కక్షతో రెండున్నరేళ్ల చిన్నారిని హత్య చేశారు దుండగులు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 31న బాలిక అపహరణ కేసు నమోదైంది. జూన్ 2న టప్పల్ ప్రాంతంలోని ఓ చెత్తకుప్పలో బాలిక మృతదేహం లభించింది.
వీధి కుక్కలు బాలిక శరీర భాగాలను తీసుకురావడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులు... చిన్నారి ఇంటి సమీపంలోని వారేనని గుర్తించారు.
ఇదీ చూడండి:10వేలు అప్పు కట్టలేదని చిన్నారి హత్య