ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా సమీపంలోని యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఉన్న వంతెన పైనుంచి అమాంతం కింద ఉన్న కాలువలో పడిపోయింది ఓ బస్సు. ఈ దుర్ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు.
లఖ్‌నవూ నుంచి 50 మంది ప్రయాణికులతో దిల్లీ ఆనంద్ విహార్‌కు బయల్దేరిన బస్సు... డ్రైవర్ నిర్లక్ష్యం, నిద్ర కారణంగా ఉదయం నాలుగున్నర గంటల ప్రాంతంలో యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఎత్మాద్పూర్ వంతెన పై నుంచి ఝర్నా కాలువలో పడింది. ఈ విషాద ఘటనలో ఏడాదిన్నర సంవత్సరాల చిన్నారి సహా 29 మంది మృతి చెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఉత్తర్‌ప్రదేశ్ రవాణా శాఖ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ప్రమాదంపై రవాణాశాఖ మంత్రి, అధికారులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు సీఎం. 24 గంటల్లోగా ఘటనపై నివేదిక అందించాలని సూచించారు.