మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాలోని శంకర్గడ్ గోశాలలో శుక్రవారం 24 ఆవులు మృతి చెందాయి. ఒక్కరోజే ఇన్ని ఆవులు ప్రాణాలు కోల్పోవటం కలకలం రేపింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు.. గోశాల నిర్వహణ సరిగా లేదంటూ నిరసనలు చేశారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఆవులు మృతి చెందాయని ఆరోపించారు.
గోశాలలో ఆవులకు సరైన ఆహారం, నీరు ఇవ్వకపోవటం, అనారోగ్యానికి గురైన వాటికి చికిత్స అందించటంలో నిర్లక్ష్యంతోనే ఘోరం జరిగిందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
గోశాలలో మొత్తం బురద, మురికి నీరు నిండి ఉంది. దాంతోనే ఆవులు అనారోగ్యానికి గురై ఉంటాయి. జంతువుల మధ్య వ్యాధులు వ్యాప్తి చెందేందుకు అపరిశుభ్ర పరిస్థితులే కారణం అయి ఉండవచ్చు. వర్షపు నీరు చేరి గోశాల మొత్తం బురదమయంగా మారటమే ఆవుల మరణాలకు కారణం. ప్రతిరోజూ ఆవులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నాయి. కానీ, ఏఒక్క అధికారి పట్టించుకోవటం లేదు. నేను ఇక్కడికి వచ్చి చూసినప్పటికే బురదలో చిక్కుకుని మరణించినట్లు తెలిసింది. ఆవుల షెడ్డు పరిశుభ్రంగా లేదు.