తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిజాముద్దీన్​కు 2,100 మంది విదేశీయులు- వారి నుంచే కరోనా!

తబ్లిగ్ మత కార్యక్రమాల కోసం ఈ ఏడాది 2,100 మంది విదేశీయులు భారత్ కు వచ్చారని కేంద్ర హోంశాఖ తెలిపింది. ఇందులో 216 మంది నిజాముద్దీన్ మార్కజ్ భవనంలో ఉన్నారని.. వారిలో చాలామందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలినట్లు వెల్లడించింది. మరికొంతమంది దేశమంతా పర్యటించినట్లు స్పష్టం చేసింది.

MHA-MARKAZ
నిజాముద్దీన్

By

Published : Mar 31, 2020, 8:56 PM IST

దిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ మార్కజ్ భవనం.... ఇక్కడికి ఏటా మతపరమైన కార్యక్రమాల కోసం దేశం నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. ఇక్కడ నిర్వహించే తబ్లిగ్-ఎ-జమాత్ కార్యక్రమాలకు విదేశీయులు కూడా భారీగానే హాజరవుతుంటారు.

ఇటీవల ఈ ప్రార్థనలకు హాజరైన కొంతమంది మరణించటం, మరికొందరికి కరోనా పాజిటివ్ రావటం దేశంలో భయాందోళనలు సృష్టిస్తోంది. ఇక్కడికి వచ్చిన విదేశీయుల ద్వారా ప్రార్థనల్లో పాల్గొన్నవారికి కరోనా వైరస్ సంక్రమించింది. ఈ నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం సహా కేంద్రం, ఇతర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. మార్కజ్ కు వెళ్లినవారిని గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నాయి.

చాలామందికి కరోనా..

ఈ పరిస్థితుల్లో మార్కజ్ ప్రార్థనలకు ఈ ఏడాది ఎంతమంది వచ్చారన్న వివరాల్ని కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. 2020 జనవరి నుంచి ఇప్పటివరకు తబ్లిగ్ కార్యక్రమాలకు 2,100 మంది విదేశీయులు వచ్చారని వెల్లడించింది.

"మార్చి 21 వరకు మార్కజ్​లో 1,746 మంది ఉన్నారు. అందులో 216 మంది విదేశీయులు. వీరిలో చాలామందికి కరోనా పాజిటివ్ గా తేలింది. మిగిలిన 1,530 మంది భారతీయులు. వీళ్లు కాకుండా దాదాపు 824 మంది విదేశీయులు దేశంలోని వేర్వేరు ప్రాంతాలను సందర్శించారు."

- కేంద్ర హోంశాఖ

వీరిలో 303 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. వీరిని దిల్లీలోని వివిధ ఆసుపత్రుల్లో చేర్పించారు. మరో 1,339 మందిని నరేలా, సుల్తాన్ పురి, బక్కడ్ వాలా క్వారంటైన్ కేంద్రాలకు తరలించింది.

రాష్టాలకు సమాచారం..

ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎస్, డీజీపీలకు హోంశాఖ మార్చి 28న వివరణాత్మక సూచనలు చేసింది. తబ్లిగ్ కార్యకర్తల కదలికలను గుర్తించాలని మార్చి 29న ఐబీ డైరెక్టర్ కు రాష్ట్ర డీజీపీలు సూచించారు. ఇప్పటివరకు ఇలా 2,137 మందిని గుర్తించారు. ఇప్పటివరకు 1,203 మంది తబ్లిగ్ కార్యకర్తలకు స్క్రీనింగ్ నిర్వహించినట్లు హోంశాఖ వెల్లడించింది.

వివిధ దేశాల నుంచి..

తబ్లిగ్-ఎ-జమాత్ ప్రచారకర్తలు దేశమంతా ప్రతి సంవత్సరం మత పర్యటనలు (చిల్లా) చేస్తుంటారు. తబ్లిగ్ కార్యక్రమాలకు విదేశీయుల్లో ముఖ్యంగా ఇండోనేసియా, మలేసియా, థాయిలాండ్, మయన్మార్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, కిర్గిజిస్థాన్ దేశాల నుంచి వస్తుంటారు.

దిల్లీ నుంచి దేశమంతా..

వీరంతా హజ్రత్ నిజాముద్దీన్​లో బంగ్లావాలి మసీదులోని తబ్లిగ్ మార్కజ్ కు వస్తారు. ఇక్కడ చిల్లాకు సంబంధించిన వివరాలు తీసుకుని దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళతారు. చిల్లా కార్యక్రమాలను అన్ని రాష్ట్రాల్లోని జిల్లా సమన్వయకర్తలు లేదా అమీర్లు పర్యవేక్షిస్తుంటారు.

ఇదీ చూడండి:దేశంలో నిజాముద్దీన్ కల్లోలం- కరోనా కేసులు పెరుగుతాయా?

ABOUT THE AUTHOR

...view details