పోటాపోటీ సభలు... నువ్వా-నేనా అంటూ సాగిన ర్యాలీలు... వాడీవేడి విమర్శలు... ఓటరుపై కుమ్మరించిన వాగ్దానాలు... ప్రచారంలో కొదమ సింహాల్లా గర్జించిన పార్టీలు.. అన్నింటికీ తెరపడింది. ఇప్పుడు ఫలితాలకు వేళయింది. ఓటరు మనోఫలకంపై ఏముందో తేలే సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో సార్వత్రిక ఫలితం తేలనుంది.
ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు సుదీర్ఘంగా జరిగిన సార్వత్రిక సమరం ముగిసింది. తొలి దశలో ఎన్నికలు పూర్తి చేసుకున్న రెండు తెలుగు రాష్ట్రాలు ఫలితాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాయి. ఎన్డీఏ గెలుపు ఖాయమని.. 300 సీట్లకు పైగా సాధిస్తుందని దాదాపు అన్ని మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో తేల్చేశాయి. మరి గెలుపుపై ఎవరి నమ్మకం ఎంత? కూటమి నేతలు ఏం ఆలోచిస్తున్నారు? భాజపా ఆత్మవిశ్వాసంతో ఉందా? ఓటరు నాడి పట్టుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ సఫలమయ్యాయా?
ధీమాగా ఎన్డీఏ...
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి.. నేటి వరకు ఫలితాలపై భాజపా ఆత్మవిశ్వాసం కనబరిచింది. మరోసారి మోదీ సర్కారు రావడం ఖాయమని నేతలు చెబుతూనే ఉన్నారు. 300 సీట్లు గెలుస్తామని ప్రకటించారు. వారి మాటలకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి.
భాజపా కేంద్ర కార్యాలయం ఇప్పటికే సంబరాలకు ముస్తాబవుతోంది. ఓట్ల లెక్కింపు వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా నేతలకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. మరి ఎన్డీఏ గెలుపు ఖాయమా? లేక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తారుమారవుతాయా? వేచి చూడాలి.
వరుస భేటీలు...
ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీఏకే జైకొట్టినా.... కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి ఆశలు వదులుకోలేదు. నేతలు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిల్లీ, బంగాల్, యూపీలో తీరిక లేకుండా తిరుగుతున్నారు. ఎన్డీఏయేతర పక్షాలు ఏకతాటిపై ఉన్నాయన్న సందేశాన్ని బలంగా వినిపించాలని ప్రయత్నిస్తున్నారు. యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీతో తొలిసారి టెన్జన్పథ్లో భేటీ అయి... ఎన్నికల వేళ అనుసరించాల్సిన వ్యూహాలపై సుమారు 40 నిమిషాలపాటు చర్చించారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు, వాస్తవాలకు చాలా దూరం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కూటమి నేతలు. ఒకవేళ భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్య చేరుకోకపోతే.. సత్వరం మహాకూటమి తరఫున రాష్ట్రపతికి లేఖ రాసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందడుగు వేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల ఫలితాలు వచ్చాకే కార్యాచరణ ప్రకటిద్దామనే యోచనలో ఎస్పీ, బీఎస్పీ ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాలు అనుకూలంగా వస్తే ఎన్డీఏయేతర కూటమితో కలిసేలా వీరు వ్యూహాలు రచిస్తున్నారు. కూటమి నేతల వ్యూహాలు ఫలించి.. కేంద్రంలో భాజపాయేతర ప్రభుత్వం ఏర్పాటవుతుందా? లేక నమో ప్రభంజనం పునరావృతం అవుతుందా?.... తేలాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
తీవ్ర ఉత్కంఠ...
రాజకీయ పార్టీలు, నేతలతో పాటు ప్రజలు ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీ భవితవ్యం ఏంటో తెలుసుకునేందుకు ఊవిళ్లూరుతున్నారు. రాజకీయ విశ్లేషకుల అంచనాలు, గెలుపుపై పార్టీల విశ్వాసాలు, ఎగ్జిట్ పోల్స్‌లో ఏది నిజమన్న ప్రశ్నకు మరికొద్ది గంటల్లో సమాధానం రానుంది.