Bharat Name Controversy :భారత్ వర్సెస్ ఇండియా చర్చ నడుస్తున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. దిల్లీలో జరుగుతున్న జీ20 సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. భారత్ నేమ్‌ప్లేట్‌తో కనిపించారు. జీ 20 సదస్సులో మోదీ కూర్చున్న వేదికపై దేశం పేరు భారత్ అని రాసి ఉంది. దీంతో అంతర్జాతీయ వేదికలపై కూడా ఇండియా బదులు భారత్ అనే పేరునే ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కేంద్రం పట్టుదలతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టమైంది.
ప్రతిపక్షాల మండిపాటు
Opposition On Inida Name Change In Telugu :మరోవైపు కేంద్రం తాజా చర్యపై విపక్షాలు మండిపడ్డాయి. మోదీ సర్కార్ ప్రజలను విడగొడుతోందని విరుచుకుపడ్డాయి. బీజేపీ నిరంకుశ ప్రభుత్వంగా మారిపోయిందని ఆరోపించారు మాజీ ఎంపీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు హన్నన్ మొల్లా. ఇండియా పేరు మార్పుపై వివాదం నడుస్తున్న సమయంలోనే మోదీ భారత్ నేమ్‌ప్లేట్‌ను ఉపయోగించడం.. ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాలను గౌరవించకపోవడమేనని విమర్శించారు.
"అధికార బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ప్రపంచమంతా ఇండియా అంటేనే తెలుస్తోంది. ఇండియాను కూడా రాజ్యాంగంలో ప్రత్యేకంగా పొందుపరిచారు. వచ్చే ఎన్నికల్లో ఓటమిని తప్పించుకోవడానికి చేస్తున్న కుట్ర ఇది."
--అబ్దుల్ ఖలీగ్, కాంగ్రెస్ ఎంపీ