తెలంగాణ

telangana

ETV Bharat / bharat

100 రోజులు పూర్తైన రాహుల్​ భారత్​ జోడో యాత్ర.. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా..! - Rahul gandhi news

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్న భారత్‌ జోడో యాత్ర వంద రోజులకు చేరింది. తమిళనాడు నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటివరకూ 8 రాష్ట్రాలను చుట్టేసింది. 2800 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ఈ యాత్రకు మంచి ఆదరణ లభించటంతో పాటు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని మద్దతు ప్రకటించారు.

Bharat Jodo Yatra latest news
Bharat Jodo Yatra latest news

By

Published : Dec 16, 2022, 12:47 PM IST

Updated : Dec 16, 2022, 1:02 PM IST

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర 100రోజులు పూర్తి చేసుకుంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 3,500 కిలోమీటర్ల దూరం సాగుతోన్న ఈ యాత్రకు అన్నివర్గాల నుంచి ఆదరణ లభిస్తోందని హస్తం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్‌ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్‌ జోడో యాత్ర ఇప్పటివరకూ 8రాష్ట్రాల గుండా సాగింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో యాత్ర పూర్తికాగా ప్రస్తుతం రాజస్థాన్‌లో సాగుతోంది.

ఇప్పటివరకు 2800కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ఈ యాత్ర ద్వారా రాహుల్‌ తన మద్దతుదారులతోపాటు వ్యతిరేకులను కూడా ఆకట్టుకున్నారు. భారత్‌ జోడో యాత్రలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొని మద్దతు ప్రకటించారు. బుల్లితెర, వెండితెర నటీనటులతోపాటు వివిధ రంగాల ప్రముఖులు కూడా పాల్గొన్నారు. బాలీవుడ్‌కు చెందిన రియాసేన్‌, పూజాభట్‌, సుశాంత్‌సింగ్‌, స్వరభాస్కర్‌, రేష్మీ దేశాయ్‌, ఆకాంక్ష పూరీ, అమోల్‌ పాలేకర్‌ తదితర ప్రముఖులు రాహుల్‌తో కలిసి పాదయాత్ర చేశారు. నౌకాదళం చీఫ్‌ విశ్రాంత అడ్మిరల్‌ రామదాస్‌, ప్రతిపక్ష నేతలు ఆదిత్య ఠాక్రే, సుప్రియా సూలే,ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌సహా రచయితలు, విశ్రాంత మిలిటరీ అధికారులు, ఇతర రంగాల ప్రముఖులు కూడా భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భారత్‌ జోడో యాత్రలో పలు వివాదాలు తలెత్తాయి. వీటిపై కాంగ్రెస్‌, భాజపా మధ్య మాటలయుద్ధం సాగింది. ఈ యాత్రలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు, ఆయన ఆహర్యంపై భాజపా ఆరోపణలు చేసింది. ఖరీదైన టీ షర్ట్‌ ధరించి రాహుల్‌ యాత్ర చేస్తున్నారని భాజపా నేతలు విమర్శించారు. నెరిసిన గడ్డంతో రాహుల్‌ ఇరాక్‌ నియంత సద్దాం హుస్సేన్‌ను తలపిస్తున్నారని అసోం సీఎం హిమంతబిశ్వ శర్మ విమర్శించారు. వివాదాస్పద క్రైస్తవ మత బోధకుడితో రాహుల్‌ భేటీ కావటం వివాదాస్పదమైంది. భారత్‌ జోడో యాత్ర ఈనెల 24న దేశ రాజధాని దిల్లీ చేరనుంది. 8రోజుల విరామం తర్వాత మళ్లీ ప్రారంభం కానుంది. దిల్లీ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, పంజాబ్‌ తర్వాత యాత్ర గమ్యస్థానమైన జమ్ముకశ్మీర్‌కు చేరుకుంటుంది.

భారత్‌ జోడో యాత్రకు అన్నివర్గాల విశేష స్పందన లభించటంపై కాంగ్రెస్‌ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాత్ర ప్రభావం 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఉంటుందని గట్టి ఆశాభావంతో ఉన్నారు. ఇటీవల ముగిసిన గుజరాత్, హిమాచల్‌ శాసనసభ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు రావటమే ఇందుకు నిదర్శనమని హస్తం నేతలు అంటున్నారు. అయితే ఈ యాత్ర వల్ల పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి ఫలితం ఇవ్వనుందనేది వచ్చే ఏడాది జరిగే కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ శాసనసభ ఎన్నికల ద్వారా తెలిసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Last Updated : Dec 16, 2022, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details