పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) జాతీయ స్థాయిలో కూడా కీలక పాత్ర పోషించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నెల 30న జరిగే భవానీపుర్ ఉప ఎన్నికలో(Bhabanipur bypoll) విజయం సాధించడం అందుకు తొలిమెట్టు అవుతుంది. గత ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీచేసి ఓడిపోయిన మమత ఈసారి భవానీపుర్ నుంచి విజయ గర్జన చేసి తీరాలని పట్టుదలగా ఉన్నారు. ఆమె సంకల్పం నెరవేరడం అసాధ్యమేమీ కాదు. 'దెబ్బతిన్న పులి'ని అని చెప్పుకొంటున్న మమతపై(West Bengal CM) పోటీచేస్తున్న భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్ కానీ, సీపీఎం అభ్యర్థి శ్రీజీవ్ బిశ్వాస్ కానీ దీదీకి దీటైనవారు కాదు. భాజపా అభ్యర్థి ఖాతాలో ఇంతవరకు రాజకీయ విజయాలేవీ లేవు. అయితే ఆమె ‘భయమెరుగని మహిళ’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అభివర్ణించారు. కాంగ్రెస్ అసలు పోటీచేయడమే లేదు. అన్నట్టు మమత, ప్రియాంక, శ్రీజీవ్ ముగ్గురూ న్యాయవాదులే. మమత ప్రస్తుతం ప్రాక్టీస్ చేయకపోయినా, ఆమె హైకోర్టు బార్ అసోసియేషన్‌లో ఇప్పటికీ సభ్యురాలే. భాజపా అభ్యర్థి ప్రియాంక అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండలో బాధితుల పక్షాన హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు లభించిన 35 శాతం ఓట్లను నిలబెట్టుకోవడానికే భాజపా పోటీ చేస్తోంది. సీపీఎం అభ్యర్థి బిశ్వాస్ భవానీపూర్ వాస్తవ్యుడు. ఎన్నికలకు కొత్త. 34 ఏళ్లపాటు బెంగాల్‌ను పాలించిన సీపీఎం నేతృత్వంలోని వామపక్ష ఫ్రంట్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో(West Bengal Assembly Elections) కనీసం ఒక్కసీటు కూడా గెలవలేకపోయింది. దీన్నిబట్టి ఉపఎన్నికలో బిశ్వాస్ విజయావకాశాలు ఏపాటివో అంచనా వేసుకోవచ్చు.
మినీ భారతం భవానీపుర్
భవానీపుర్(Bhabanipur Election) వాస్తవ్యురాలైన మమత ఆ నియోజకవర్గం నుంచి 2011, 2016లలో ఎన్నికయ్యారు. ఇక్కడ ముస్లిం ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉన్నారు. వారు మొదటి నుంచీ తృణమూల్ కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్నారు. గుజరాతీలు, సిక్కులు, బిహారీల జనాభా కూడా అధికమే. ఈ మినీ భారతంలో తృణమూల్ వరుస విజయాలు సాధిస్తున్నా భారతీయ జనతా పార్టీ ఈమధ్య అక్కడ బలం పెంచుకొంటోంది. కానీ, దిల్లీలో రైతు ఉద్యమం వల్ల సిక్కు, పంజాబీ ఓటర్లు ఆ పార్టీకి దూరమయ్యారు. ఈ ఉపఎన్నికలో పోటీకి కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండటం తృణమూల్‌కు లాభిస్తుంది. ఈ రెండు పార్టీల ఐక్యత జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి ఆవిర్భావానికి దోహదం చేస్తుందని అంచనా.
మమత ప్రచారం