తెల్లవారుజామున నీళ్లు తాగుదామని లేచేసరికి.. ఇంట్లో ఏదో అలజడి. అనుమానం వచ్చి చూసేసరికి వంటింట్లో ఏడుగురు దోపిడీ దొంగలు.. కిచెన్‌లోకి అడుగు పెట్టగానే దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సన్నివేశాన్ని చూసిన ఎవరైనా భయపడి హడావుడి చేస్తారు. కానీ వీరిని గమనించిన ఆ ఇంటి యజమాని ధైర్యంగా, చాకచక్యంగా వ్యవహరించాడు. కేవలం చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించి దొంగలకు చుక్కలు చూపించాడు. సమయస్ఫూర్తితో మెలిగి పోలీసులకు సమాచారం అందించి దోపిడీ దొంగల ఆట కట్టించాడు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది.
అజయ్ బాలగోపాల్ అనే వ్యక్తి.. కుమారులు రాహుల్, సమీర్‌తో కలిసి రఘువనహళ్లి సమీపంలోని నారాయణనగర్ 1 బ్లాక్, విశ్రాంతి లేఅవుట్లో నివసిస్తున్నారు. 27 ఏళ్ల రాహుల్ ఓ ఆటోమోటివ్స్ సంస్థలో మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రోజులాగే బుధవారం ఉదయాన్నే లేచి నీళ్లు తాగేందుకు వెళ్లగా.. వంటింట్లో ఏదో అలజడి వినిపించింది. "మా నాన్న లేదా సోదరుడు ఉన్నారు అనుకున్నాను. కానీ కొద్దిసేపయ్యాక వారు కాదని అర్థమైంది. వెంటనే నా ఫోన్ సహాయంతో ఇంట్లోని సీసీటీవీ కెమెరాల లైవ్ ఫుటేజీ చూశాను. ఫర్నీచర్ వెనక ఇద్దరు వ్యక్తులు దాక్కున్నారని గమనించాను." అని రాహుల్ వివరించాడు.
ఇంట్లోకి దొంగలు ప్రవేశించారని గుర్తించిన రాహుల్.. మెల్లగా పైకెళ్లి తండ్రిని లేపాడు. ఇంట్లో ఉన్న లైసెన్స్డ్ డబుల్ బ్యారెల్ తుపాకీ తీసుకుని కిందకు వచ్చాడు. మరోసారి సీసీటీవీ కెమెరాల ఫుటేజీ చూడగా.. కిచెన్‌లో మరో ఐదుగురు దొంగలు దాక్కున్నారని గమనించాడు. దొంగల చేతుల్లో పదునైన ఆయుధాలు, రాడ్లు, పైపులు ఉన్నాయని.. తాము వస్తే దాడి చేసేందుకే వారు ఎదురుచూస్తున్నారని రాహుల్‌కు అర్థమైంది. వెంటనే అప్రమత్తమై పక్కింటి వాచ్‌మన్ సాయంతో పోలీసులకు సమాచారం అందించాడు. తుపాకీతో కిందకు వచ్చిన రాహుల్, అతడి తండ్రి.. ఫర్నీచర్ వెనుక దాక్కున్న ఇద్దరికి గురిపెట్టి, వారిని బంధించారు. కేవలం 12 నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగుల చేతిలో ఆయుధాలను గమనించిన పోలీసులు.. లోపలకు వెళ్లకుండా ఆగారు. దొంగలు పారిపోకుండా ఇంటి బయటే తలుపుల వద్ద కాపు కాశారు. స్టేషన్‌కు ఫోన్ చేసి అదనపు బలగాలను పంపించాలని కోరారు.