Bengal minor sets fire: పశ్చిమ బంగాల్లో దారుణం జరిగింది. తన మీద పెట్టిన అత్యాచార యత్నం కేసును వెనక్కి తీసుకోవాలని 14 ఏళ్ల బాలికను బెదిరించారు ఓ ఇద్దరు కిరాతకులు. లేదంటే కుటుంబాన్నే చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆమె భయంతో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. మయినాగుడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
ఫిబ్రవరి 28న ఒంటరిగా ఉన్న సమయంలో తనపై ఓ వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించాడని కేసు పెట్టింది బాలిక. నిందితుడిని పోలీసులు అప్పుడే అదుపులోకి తీసుకున్నారు. ఈ మధ్యే బెయిల్పై విడుదలయ్యాడు. అనంతరం బాలిక ఇంటికి మరో వ్యక్తితో వెళ్లి కేసు వాపస్ తీసుకోవాలని బెదిరించాడు. దీంతో ఆమె నిప్పంటించుకుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు కారణమైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.