Bengal Accident Today : బంగాల్లోని ఖరగ్పుర్ సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు కూలీలు మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పికప్ వ్యాన్లో పువ్వులు లోడ్ చేస్తుండగా సిమెంట్ లారీ ఢీకొట్టడం వల్ల ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పశ్చిమ మేదినీపుర్ జిల్లా.. ఖరగ్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బురమలా వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను రక్షించి తదుపరి చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మిడ్నాపుర్ ఆస్పత్రికి తరలించారు.
"శనివారం ఉదయం కార్మికులు.. పికప్ వ్యాన్లో పూలు లోడింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో 10-12 మంది కార్మికులు.. పువ్వులు లోడ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అకస్మాత్తుగా సిమెంట్ లారీ వెనుక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఒకరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించారు" అని పోలీసులు తెలిపారు.
మరో ప్రమాదంలో..
కొన్నిరోజుల క్రితం.. తమిళనాడులో ప్రభుత్వ బస్సును టాటా సుమో ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయనిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం మరో ఇద్దరు చనిపోయారు. ఘటనలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. టాటా సుమోలో ప్రయానిస్తున్న వారు అన్నామలైయార్ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది.