గుజరాత్‌లోని ఓ బ్యాంక్‌లో భారీ దొంగతనం జరిగింది. దాదాపు రూ. 47.88 లక్షలు విలువ చేసే.. నగలు, విదేశీ కరెన్సీ అపహరణకు గురైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగతనానికి పాల్పడిన బ్యాంక్ ప్యూన్, అతని భార్యను అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అహ్మదాబాద్ ప్రీతమ్ నగర్‌లోని ఓ బ్యాంక్‌లో రెండు లాకర్ల నుంచి బంగారం, వెండి, విదేశీ కరెన్సీ చోరీకి గురైంది. దీన్ని గుర్తించిన బ్యాంక్ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా.. బ్యాంక్‌లో పనిచేసే ప్యూన్ చిరాగ్ దతానియా, అతని భార్య అర్చనా దతానియా ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా తామే ఈ దొంగతనం చేసినట్లు అంగీకరించాడు.
చిరాగ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు.. రెండు బ్యాగుల నిండా బ్యాంకు సొత్తును గుర్తించారు. బంగారం, వెండి ఆభరణాలు, విదేశీ కరెన్సీతో పాటుగా మూడు పాస్‌పోర్ట్‌లను కూడా స్వాధీనం చేసుకొన్నారు. అయితే చోరీకి గురైన వాటిలో కొన్ని నగలు కనిపించలేదని పోలీసులు తెలిపారు. నిందితులు వాటిని విక్రయించారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు.
బ్యాంక్ అధికారులు కొన్నిరోజుల క్రితం లాకర్ ఛార్జ్‌లు చెల్లించని వారి అకౌంట్లను స్తంభింపచేశారు. వాటిలో ఉన్న విలువైన నగలు, కరెన్సీని రెండు సాధారణ లాకర్లలోకి మార్చారు. దీన్ని గమనించిన ప్యూన్.. తన భార్యతో కలిసి ఓ పథకం రచించాడు. చిరాగ్ భార్య ఓ సాధారణ కస్టమర్లా బ్యాంక్‌లో ప్రవేశించింది. అక్కడ చిరాగ్ సహాయంతో లాకర్ రూమ్‌లోకి వెళ్లి.. ఈ దొంగతనానికి పాల్పడినట్లు డీసీపీ తెలిపారు.