HASINA INDIA VISIT : స్నేహం ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలదని, భారత్‌తో తమది అలాంటి మైత్రేనని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. పేదరిక నిర్మూలన,ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిపై భారత్-బంగ్లాదేశ్‌లు కలిసి పనిచేస్తున్నాయని ఆమె తెలిపారు. భారత పర్యటనలో ద్వైపాక్షిక చర్చలు ఫలవంతంగా సాగుతున్నాయని,హసీనా వెల్లడించారు.
'భారత్‌తో మాది అలాంటి స్నేహమే.. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం పక్కా'
భారత్ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. పేదరిక నిర్మూలన,ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిపై భారత్-బంగ్లాదేశ్‌లు కలిసి పనిచేస్తున్నాయని హసీనా తెలిపారు.
బంగ్లాదేశ్ ప్రధానికి రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని నరేంద్రమోదీ స్వాగతం పలికి మంత్రివర్గ సహచరులను పరిచయం చేశారు. అనంతరం షేక్ హసీనా గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు మహాత్మా గాంధీ స్మారక స్థూపం రాజ్‌ఘాట్ వద్ద ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సందర్శకుల పుస్తకంలో తన సందేశం రాశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్‌లతో హసీనా నేడు సమావేశం అవుతారు. ప్రధాని మోదీతోనూ దైపాక్షిక చర్చలు జరుపుతారు. మోదీతో తన చర్చలు దక్షిణాసియా దేశాల ప్రజల స్థితిగతులను మెరుగుపర్చడం పేదరికాన్ని నిర్మూలించే దిశగా ఉంటాయని హసీనా తెలిపారు.
"పేదరిక నిర్మూలన, ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడంపై మేము ప్రధానంగా దృష్టి సారించాం. ఈ సమస్యలన్నింటిపై భారత్-బంగ్లాదేశ్‌లు కలిసి పనిచేస్తున్నాయి. భారత్, బంగ్లాలే కాకుండా దక్షిణాసియా అంతటా ప్రజలు మెరుగైన జీవన ప్రమాణాలను పొందాలన్నదానిపైనే దృష్టి సారిస్తాం. భారత్‌తో ద్వైపాక్షిక చర్చలు చాలా ఫలవంతంగా సాగుతున్నాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందడం, ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడం మా ప్రధాన లక్ష్యం. మేము దాన్ని సాధించగలమని ఆశాభావంతో ఉన్నాను. స్నేహంతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. మేము ఇప్పుడు అదే చేస్తున్నాం."
-షేక్ హసీనా, బంగ్లాదేశ్ ప్రధాని