తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జెండా మోసి దేశభక్తిని చాటిన వీరనారి.. జైల్లోనే ప్రసవం - ఆజాదీ కా అమృత్ మహోత్సవ్​

ఆరు నెలల గర్భిణి.. ఉద్యమమంటూ బయటకు రావటమే ఆశ్చర్యం.. శాసనోల్లంఘనమంటూ బ్రిటిష్‌ పోలీసుల కళ్లుగప్పి పొలంగట్ల వెంట నడిచి వెళ్లటం ఇంకా అనూహ్యం! అక్కడితో ఆగకుండా.. భర్త సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంపై త్రివర్ణ పతాకం ఎగరేస్తుంటే.. పోలీసుదండుకు అడ్డుగా నిలిచి వందేమాతరం అంటూ ఊరంతా కదిలేలా నినదిస్తే.. అది అసాధ్యం! అలాంటి అసాధ్యాన్నే సుసాధ్యం చేసిన సాహసి.. జైల్లోనే బిడ్డను కన్న ధీశాలి.. మన తెలుగుతేజం పసల అంజలక్ష్మి!

azadi ka amrit mahotsav
తెలుగుతేజం పసల అంజలక్ష్మి

By

Published : Jul 4, 2022, 6:47 AM IST

Updated : Jul 4, 2022, 7:39 AM IST

గాంధీని అభిమానించి అనుసరించటమే గాదు.. ఏకంగా ఆవాహన చేసుకొని.. మనసా వాచా ఆచరించి చూపిన అరుదైన స్వాతంత్య్ర సమర యోధులు పసల కృష్ణమూర్తి-అంజలక్ష్మి దంపతులు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని పడమర విప్పర్రులో 1900 జనవరి 26న సంపన్న కుటుంబంలో జన్మించారు పసల కృష్ణమూర్తి. 1904లో తణుకు తాలూకా కుముదవల్లిలో మునసబు కుటుంబంలో పుట్టారు అంజలక్ష్మి. 1916లో వీరికి పెళ్లయింది. 1921లో గాంధీజీ విజయవాడ, ఏలూరు పర్యటన వీరి జీవితాల్ని మార్చివేసింది. గాంధీజీ సమక్షంలో ఇద్దరూ కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకొని స్వాతంత్య్ర సమరంలో దూకారు. 1929 ఏప్రిల్‌ 25న చాగల్లు ఆనంద నికేతన్‌కు వచ్చిన గాంధీజీని కలిసి ఖద్దరు నిధికి తమ ఒంటిపైనున్న ఆభరణాలన్నింటినీ ఇచ్చేశారు. వెంట వచ్చిన ఆరేళ్ల కుమార్తె సత్యవతి, నాలుగేళ్ల కుమారుడు ఆదినారాయణ కూడా తమ ఆభరణాలను సమర్పించారు. వెంటనే గాంధీజీ.. పిల్లలను తన ఒళ్లో కూర్చోబెట్టుకొని ఇప్పుడిచ్చారు సరే.. మళ్లీ బంగారంపై మోజు పడకుండా ఉంటారా.. అని అడగ్గా.. ఇకపై నగలు ధరించబోమంటూ ప్రతిన బూనారు. నాటి నుంచి వారు బంగారం జోలికెళ్లలేదు. రెండో కుమార్తె కృష్ణభారతికి చెవులను కూడా కుట్టించలేదు. కృష్ణమూర్తి జీవితాంతం బాపూజీ వేషధారణలోనే సంచరించారు. అంజలక్ష్మి స్వయంగా వడికిన నూలుతో చేసిన ఖద్దరు వస్త్రాలనే ధరించారు. విదేశీ వస్త్రాల బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఇద్దరినీ 1931లో జైలుకు పంపించింది ఆంగ్లేయ సర్కారు. చంకలో నాలుగేళ్ల కుమారుడు ఆదినారాయణను పట్టుకొనే జైలుకెళ్లారు అంజలక్ష్మి.

ఆరు నెలల గర్భిణిగా..:జైలు నుంచి వచ్చాక 1932 శాసనోల్లంఘన ఉద్యమంలో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు. అప్పటికే కాంగ్రెస్‌ను నిషేధించిన ఆంగ్లేయ సర్కారు, సమావేశాలు జరపొద్దని ఆజ్ఞాపించింది. జూన్‌ 27న భీమవరంలో ఆ శాసనాన్ని ఉల్లంఘిస్తూ కృష్ణమూర్తి అధ్యక్షతన కాంగ్రెస్‌ సమావేశం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఎలాగైనా అడ్డుకోవాలని పోలీసులు పట్టుదలకు పోయారు. కృష్ణమూర్తి- ఆరు నెలల గర్భిణి అంజలక్ష్మి దంపతులు మరికొందరు కార్యకర్తలతో కలసి రహస్యంగా పొలంగట్లపై నుంచి పోలీసుల కంటపడకుండా భీమవరం చేరి సమావేశం నిర్వహించారు. అనంతరం కృష్ణమూర్తి మరికొందరు సహచర యోధులతో భవనంపైకెక్కి మువ్వన్నెల కాంగ్రెస్‌ జెండాను ఎగురవేసి వందేమాతరం అంటూ నినదించారు. పోలీసులు త్రివర్ణ పతాకావిష్కరణను అడ్డుకోకుండా అంజలక్ష్మి.. తన సహచర మహిళలతో నిలువరించారు. ఈ సంఘటన దక్షిణాది బర్దోలిగా పేరొందింది. తర్వాత పోలీసులు ఈ సంఘటనలో పాల్గొన్న అందరినీ అరెస్టు చేశారు. అంజలక్ష్మికి పది నెలల జైలుశిక్ష పడగా.. గర్భిణీగా ఉన్నా ఎలాంటి జంకులేకుండా జైలుకు వెళ్లారామె. అక్టోబరు 29న వెల్లూరు జైల్లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కృష్ణుడిలా కారాగారంలో పుట్టినందుకు 'కృష్ణ', భారతావని దాస్య శృంఖలాలు తెంచే పోరాటంలో భాగమైనందుకు 'భారతి' కలిపి.. ఆ బిడ్డకు కృష్ణభారతి అని పేరుపెట్టారు. 1933 ఏప్రిల్‌లో ఆరునెలల పసిగుడ్డుతో అంజలక్ష్మి జైల్లోంచి బయటకు వస్తుంటే.. ప్రజలు నీరాజనాలు పట్టారు.

జాతీయోద్యమంలో పాల్గొన్నందుకు ఆగ్రహించిన ప్రభుత్వం ఇంట్లో మట్టిపాత్రలు తప్పించి మరేమీ మిగలకుండా చేసింది. కృష్ణమూర్తి-అంజలక్ష్మి దంపతులిద్దరూ వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ, అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారు. తమ ఇంటిలోనే ఆశ్రయం కల్పించి, దళిత, పేద బాల బాలికలకు చదువు చెప్పించారు. మరోవైపు.. ఖద్దరు ధరించని వారి ఇళ్లకు, పెళ్లిళ్లలో భోగం మేళాలు ఏర్పాటు చేసినవారి ఇళ్లకు వెళ్లబోమంటూ వీరు చేసిన ప్రతిన చాలామంది బంధువులకు ఆగ్రహం తెప్పించింది. అయినా వారు వెరవలేదు. గ్రామంలోని తమ ఇంటినే ధర్మాసుపత్రిగా మార్చారు. ఓ వైద్యుడిని నియమించి అంజలక్ష్మి నర్సుగా, కృష్ణమూర్తి కాంపౌండరుగా సేవలందించారు. గాంధీ మార్గంలో కుష్ఠురోగులకు స్వయంగా శుశ్రూష చేశారు. తమ 60 ఎకరాల పొలాన్ని సమాజహితం కోసమే ఖర్చు చేశారు. స్వాతంత్య్రానంతరం సమరయోధులకిచ్చే పింఛను, సౌకర్యాలనూ వద్దన్నారు. ప్రభుత్వమిచ్చిన భూమినీ పేదల స్కూలుకు విరాళంగా ఇచ్చారు. కృష్ణమూర్తి రోజూ కాశీ అన్నపూర్ణ కావిడితో భిక్షాటన చేసి ఎంతోమంది పేదల ఆకలి తీర్చేవారు. 1978 సెప్టెంబరు 20న కన్నుమూసిన ఆయన గౌరవార్థం తాడేపల్లిగూడెం పురపాలక సంఘం పసల కృష్ణమూర్తి స్మారక ప్రాథమికోన్నత పాఠశాలను నెలకొల్పింది. రాష్ట్రపతి నుంచి తామ్రపత్ర పురస్కారం అందుకున్న అంజలక్ష్మి 1998లో తన 94వ ఏట కన్నుమూశారు.

ఇవీ చదవండి:'దమ్ముంటే కాచుకోండి'.. ఆంగ్లేయులపై విరుచుకుపడ్డ మన్యం వీరుడు అల్లూరి

ఆంగ్లేయులపై మహిళలతో తుపాకులు ఎక్కుపెట్టించిన నేతాజీ

Last Updated : Jul 4, 2022, 7:39 AM IST

ABOUT THE AUTHOR

...view details