Azadi ka Amrit Mahotsav: పంతొమ్మిదో శతాబ్దం ఆరంభంలో ఆంగ్లేయులు ఈ గౌరవ పతకాలను ఇవ్వటం ఆరంభించారు. యుద్ధాల్లో, పోరాటాల్లో పాల్గొన్న సిపాయిలకు ఏదో ఒక పేరుతో మెడలో వేసేవారు. ఆ తర్వాత వీటిని సాధారణ ప్రజలకు విస్తరించారు. బ్రిటన్ రాణి నుంచి అవార్డు అనగానే... ఎక్కడలేని హంగామా... స్థాయి లభించేవి. ఒకరకంగా ఈ అవార్డుల రూపంలో సమాజంలో స్థాయీభేదాలను సృష్టించేవారు. విభజించు పాలించు సూత్రంలో ఇవీ ఓ భాగంగా కొనసాగాయి.
Indian national movement: తొలుత సమాజంలోని అత్యున్నత స్థాయి వ్యక్తుల్లో ఎంపిక చేసిన కొంతమందికి మాత్రమే వీటిని కేటాయించేవారు. బ్రిటన్ రాణి ఇచ్చే నైట్‌హుడ్‌తో పాటు... వైస్రాయ్‌లిచ్చే దీవాన్ బహదూర్, నవాబ్ బహదూర్ అంటూ అనేక అవార్డులు ప్రవేశపెట్టారు. మళ్లీ వీటిలోనూ మతపరమైన, స్థాయీ పరమైన అంతరాలు. హిందువులకైతే దివాన్ బహదూర్ అని, ముస్లింలకైతే నవాబ్ బహదూర్ అని ఇచ్చేవారు. వీరికంటే తక్కువ స్థాయి వారిని ఖాన్ బహదూర్, రాయ్ బహదూర్, ఖాన్ సాహిబ్, రాయ్ సాహిబ్...ఇలా సాగేది. వీరికి వైస్రాయ్‌లు, గవర్నర్ల దర్బార్‌లలో ప్రత్యేక ఆహ్వానం ఉండేది. పనులకు గుర్తింపుగా కంటే కూడా... ఈ వర్గాల వారు బ్రిటిష్ ప్రభుత్వానికి వత్తాసు పలికేలా... తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నవారికి సహకరించకుండా చేయటం పతకాల వెనకున్న అసలు పథకం. ఇందులో భాగంగానే సంస్థానాధీశులందరికీ నైట్‌హుడ్ (పేరుకు ముందు సర్ తగిలించుకునే అవకాశం) లేదా... ఆ స్థాయిగల అవార్డో ఇచ్చారు. వాటికి తగ్గట్లుగా గన్‌సెల్యూట్ చేసేవారు. 21 గన్‌ల సెల్యూట్ చేస్తే అందరికంటే గొప్ప కింద లెక్క. నిజాం, మైసూర్, బరోడా, కశ్మీర్ మహారాజులకు ఈ గౌరవం ఉండేది. మిగిలిన వారికి... స్థాయి ప్రకారం... 3 గన్ల సెల్యూట్ దాకా సాగేది. బ్రిటిష్ పతకాల కోసం, అవార్డుల కోసం నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ డబ్బులిచ్చి మరీ లాబీయింగ్ చేశాడంటారు.
గాంధీజీ... రవీంద్రుడికీ...
దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఆంగ్లేయుల తరఫున బోర్ యుద్ధంలో పాల్గొన్నారు గాంధీజీ. ఆ సేవలకు మెచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను భారత్ వచ్చాక 1915లో కైసర్-ఎ-హింద్ (భారత చక్రవర్తి) అవార్డుతో సత్కరించింది. అదే సంవత్సరం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌ను నైట్‌హుడ్‌తో సన్మానించారు. అప్పట్నుంచి రవీంద్రుడిని సర్ రవీంద్రనాథ్ ఠాగూర్‌గా పిలిచేవారు. అయితే... 1919లో జలియన్‌వాలాబాగ్ ఊచకోత అనంతరం... రవీంద్రుడు తన నైట్‌హుడ్‌ను వెనక్కిచ్చారు. విచలితుడైన ఠాగూర్ అప్పటి వైస్రాయి ఛెమ్స్‌ఫోర్డ్‌కు ఘాటైన లేఖ రాస్తూ... ‘‘నా సహచర భారతీయులపై సాగిన అకృత్యాలను చూశాక... మీరు నా మెడలో వేసిన బిళ్లను ధరించటం సిగ్గుగా అనిపిస్తోంది. తక్షణమే దీన్ని వాపస్ చేస్తున్నాను’’ అంటూ నిరసన వ్యక్తంజేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతుడైన ఠాగూర్ చర్య తప్పుడు సంకేతాలు పంపిస్తుందని గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం వెంటనే ఆయన తిరస్కరణను ఆమోదించబోమని ప్రకటించింది. సాహిత్యానికి, రాజకీయాలకు సంబంధం లేదంటూ.. ఆయన్ను కావాలని పదేపదే సర్ రవీంద్రనాథ్ అనే సంబోధించేది. ఆయన మాత్రం తన మాటపైనే నిలబడి ఉన్నారు. ఖిలాఫత్ ఉద్యమ సమయంలో... గాంధీజీ తన కైసర్ -ఎ- హింద్ అవార్డును వెనక్కి ఇచ్చేశారు. బ్రిటిష్ అవార్డులనుగానీ, పదవులనుగానీ స్వీకరించరాదని నిర్ణయించుకున్నారు.
1947 తర్వాతా...
స్వాతంత్య్రానికి ముందు 1946లో తాత్కాలిక ప్రభుత్వాన్ని చేపట్టాక... జవహర్‌లాల్ నెహ్రూ సారథ్యంలోని జాతీయోద్యమ నాయకులకు, బ్రిటిష్ అధికారులకు ఈ అవార్డుల భవితవ్యంపై తీవ్ర చర్చ జరిగింది. స్వాతంత్య్రానంతరం కూడా... భారత్‌తో సంబంధాలను కొనసాగించటంలో భాగంగా... బ్రిటన్ అవార్డులను కొనసాగించాలని ఆంగ్లేయ అధికారులు పట్టుబట్టారు. కానీ నెహ్రూ బృందం ఇందుకు ససేమిరా అంది. స్వాతంత్య్రానంతరం బ్రిటిష్ అవార్డులను కొనసాగించటమంటే... భారత సార్వభౌమత్వాన్ని కించ పరిచినట్లే అవుతుందని వాదించింది. అలా... బ్రిటిష్ ‘బిళ్ల’లను తిరస్కరించింది.
ఇదీ చూడండి:Azadi Ka Amrit Mahotsav: వెక్కిరించిన వ్యక్తే.. ఉక్కు మనిషయ్యారు!