బ్రిటిష్ ప్రభుత్వం (Britishers in India) నేరుగా భారత్‌లో పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత.. తమ సైనికులు, ఆంగ్లేయ కుటుంబాలు ఉండటానికి ప్రత్యేక ప్రాంతాలను ఏర్పాటు చేసుకుంది. వాటికే కంటోన్మెంట్లు అని పేరు. దేశవ్యాప్తంగా సుమారు 100 చోట్ల వాటిని తెరిచారు. ఇక్కడ దేశంలోని చట్టాలేవీ వర్తించవు. మొదట్లో చాలామటుకు ఆంగ్లేయ కుటుంబాలు, సైనికులు కూడా ప్రజానీకం నివసించే చోటే ఉండేవారు. దీంతో 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఆంగ్లేయుల ఇళ్లపై దాడులకు అవకాశం చిక్కింది. ఆ అనుభవం నుంచి భారతీయులతో కలసి ఉండకుండా.. దూరంగా ప్రత్యేక నివాస కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన పుట్టింది. వాటి ఫలితమే కంటోన్మెంట్లు! వీటిలో బ్రిటన్ నుంచి ఇక్కడికి పని చేయటానికి వచ్చిన ఉన్నతాధికారులతో పాటు.. సైనికులు, కిందిస్థాయి సిబ్బంది కూడా ఉండేవారు. యువకులుగా వచ్చిన వీరందరికీ ఏళ్ల తరబడి స్వదేశానికి వెళ్లే అవకాశం ఉండేది కాదు. ఐసీఎస్ (కలెక్టర్) పదవుల్లోని వారికైతే ఎనిమిదేళ్ల దాకా సెలవు ఇచ్చేవారు కాదు.
స్వావలంబన ముసుగులో..
సుదీర్ఘకాలం భారత్‌లో సేవ చేసే తమ సిబ్బంది.. శారీరక అవసరాలు తీర్చటానికి గాను.. భారతీయ మహిళలను ఎరగా వేయాలని బ్రిటిష్ ప్రభుత్వం (Prostitution in british India) నిర్ణయించింది. 1864 కంటోన్మెంట్ చట్టం ద్వారా ఈ కంటోన్మెంట్లలో వ్యభిచారానికి అనుమతినిచ్చింది. వ్యభిచార గృహాలను చట్టబద్ధం చేసింది. వీటిని 'చక్లా' అనేవారు. పేద భారతీయ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించటానికే ఈ ఏర్పాటు అంటూ ప్రభుత్వం వీటిని సమర్థించుకుంది. అనేకమంది భారతీయ మహిళలను ఈ వృత్తిలోకి బలవంతంగా నెట్టింది. అంగీకరించని చాలామందిని శారీరకంగా వేధించి మరీ ఒప్పించేవారని.. కాథరైన్ బష్నెల్ అనే ఆంగ్లేయ పరిశోధకురాలు బయటపెట్టారు.
కొలువుతో పాటు సుఖమూ..
ఇంగ్లాండ్‌లో సైనికుల భర్తీ (భారత్‌కోసం) ప్రకటనల్లో కూడా భారత్‌లో సెక్స్ ఉచితం, ఎలాంటి సుఖవ్యాధులు రాకుండా జాగ్రత్తలుంటాయి.. అంటూ ప్రత్యేకంగా పేర్కొనేవారు. అయితే ఇందులోనూ జాత్యహంకార వివక్ష చూపించటం బ్రిటిష్‌వారికే చెల్లింది. వ్యభిచారానికి అనుమతిస్తూనే.. సుఖవ్యాధుల సంక్రమణపై తమ సైనికులను హెచ్చరించేది సర్కారు. కంటోన్మెంట్లలోని వేశ్యలకు క్రమం తప్పకుండా జైలు ఆసుపత్రుల్లో పరీక్షలు చేసేవారు. ఈ పరీక్షలు దాదాపు.. సర్జికల్ అత్యాచారాల్లా ఉండేవి. అదే.. వేశ్యలతో గడిపే తమ ఆంగ్ల సైనికులు, సిబ్బందికి మాత్రం ఈ పరీక్షల నుంచి మినహాయింపునిచ్చేవారు. కారణం- మగవారికి ఈ పరీక్షలు చేయటాన్ని నామోషీగా పరిగణించేవారు. 30శాతం మంది బ్రిటిష్ సైనికులకు సుఖవ్యాధులున్నట్లు తేలగా.. దానికీ భారతీయ మహిళలనే నిందించిన ఘనత ఆంగ్లేయ ప్రభుత్వానిది. 'స్థానిక వాతావరణ పరిస్థితులతో పాటు.. విలువల్లేని భారతీయుల వల్లే ఈ సమస్యలన్నీ' అంటూ నిందించింది. 1868లో సాంక్రమిక వ్యాధులపై ఓ చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం.. సుఖ వ్యాధులున్న మహిళలను అరెస్టు చేసి.. ప్రత్యేక ఆసుపత్రిలో (లాక్ హాస్పిటల్స్) మూడునెలల పాటు ఉంచేవారు. 1898లోనే కాథరైన్ బష్నెల్ మరో ఇద్దరు ఆంగ్లేయులతో కలసి ఈ దారుణాలపై 'ది క్వీన్స్ డాటర్స్' అనే పుస్తకం రాశారు. స్త్రీవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత.. ఉద్యమాల తర్వాత.. 1930లో వ్యభిచారాన్ని (Prostitution in ancient India) బ్రిటిష్ సర్కారు రద్దు చేసింది.
అబ్బాయిలతో మాట్లాడినా..
ఎప్పటికప్పుడు కొత్త అమ్మాయిల కోసం కంటోన్మెంట్ల నుంచి లేఖలు వెళ్లేవి. దీంతో అమ్మాయిల వేటకు స్థానిక పోలీసులను ఉపయోగించుకునేవారు. ఎవరైనా అమ్మాయి.. అబ్బాయితో మాట్లాడుతున్నట్లు కనిపిస్తే చాలు వ్యభిచారిగా ముద్రవేసి తీసుకొని వెళ్లి.. కంటోన్మెంట్ మేజిస్ట్రేట్ ముందు నిలబెట్టి.. వేశ్యావాటికలో (History of prostitution in India) నమోదు చేయించేవారు. ప్రతి ఊరిలోంచి 15 మంది యువతుల కోసం వెతుకులాట సాగేది. వారిని నయానో భయానో తీసుకొచ్చేవారు. పాతవారిని తరిమేసేవారు. వెయ్యి మంది బ్రిటిష్ సైనికులుండే రెజిమెంట్లలో.. 12-15 మంది భారతీయ మహిళలను అందుబాటులో ఉంచి క్రూరంగా ప్రవర్తించేవారు. రెజిమెంట్లు ఎక్కడికెళితే అక్కడికి వీరిని కూడా తరలించేవారు.
ఇవీ చూడండి:Azadi Ka Amrit Mahotsav: గాంధీ-ముసోలిని భేటీ.. ఆంగ్లేయుల్లో కలవరం!
Azadi Ka Amrit Mahotsav: భారత్‌లో బ్రిటిష్ పాలనకు ఆద్యుడు ఆయనే