Azadi Ka Amrit Mahotsav: 1857 జులై 11న కేరళలోని పాలక్కడ్ జిల్లా మన్కర గ్రామంలో సంపన్న కుటుంబంలో జన్మించారు చెట్టూర్ శంకరన్. ఆయన తాతముత్తాతలు ఈస్టిండియా కంపెనీలో, ఆయన తండ్రి బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాలు చేశారు. న్యాయశాస్త్ర పట్టా పొందిన శంకరన్ అప్పుడప్పుడే ఎదుగుతున్న భారత జాతీయ కాంగ్రెస్‌కు 1897లో అధ్యక్షుడిగా వ్యవహరించారు. సంఘ సంస్కరణల విషయంలో సంప్రదాయ భారతీయులతో.... స్వయం నిర్ణయాధికారాల విషయంలో బ్రిటిష్ ప్రభుత్వంతో ఆయన ఢీ అంటే ఢీ అన్నారు.
1908లో మద్రాసు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యాక కులాంతర, మతాంతర వివాహాలను సమర్థిస్తూ తీర్పులిచ్చారు శంకరన్ నాయర్. నాలుగేళ్ల తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు నైట్‌హుడ్ ఇచ్చింది. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా (ప్రస్తుత కేంద్ర మంత్రి హోదాకు సమానం) తీసుకొని... విద్యాశాఖ బాధ్యతలు అప్పగించింది. మాంటెగూ ఛెమ్స్‌ఫోర్డ్ సంస్కరణలపై చర్చ జరుగుతున్న సందర్భంగా... బ్రిటిష్ న్యాయమూర్తులు ఆంగ్లేయుల పట్ల పక్షపాతం ప్రదర్శిస్తున్నారంటూ బహిరంగంగా విమర్శలు గుప్పించిన ధీశాలి శంకరన్. ఆయన ఒత్తిడి కారణంగానే... 1919లో రాష్ట్రాలకు తొలిసారిగా పాలనాధికారాలను విస్తరించారు. బ్రిటిష్ ప్రభుత్వంలో ఉంటూనే... పాలనలో భారతీయుల భాగస్వామ్యాన్ని, స్వయం నిర్ణయాధికారాన్ని పెంచాలని ప్రయత్నించారు శంకరన్ నాయర్. ఈ క్రమంలో... గాంధీజీ ఉద్యమ ప్రణాళికలతో ఆయన విభేదించేవారు.