తెలంగాణ

telangana

ETV Bharat / bharat

AZADI KA AMRIT MAHOTSAV: లక్ష్మీ బాయికి అండగా నిలిచిన ధీర వనిత ఝల్కరీ! - స్వాతంత్ర్య సంగ్రామంలోఝల్కరీ భాయి పాత్ర

AZADI KA AMRIT MAHOTSAV: ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి పేరు వచ్చినప్పుడల్లా తలచుకోవాల్సిన మరో పేరు... ఝల్కరీ బాయి! చరిత్ర పుటల్లో మరుగున పడిపోయినా ప్రజల నోళ్లలో నానుతున్న పేరిది. అచ్చం రాణిలా ఉండే తన రూపురేఖలతో ఆంగ్లేయులను ఏమార్చి... బ్రిటిష్‌ దాడి నుంచి రాణి లక్ష్మీబాయిని తప్పించిన దళిత వీరవనిత ఝల్కరీ.

AZADI KA AMRIT MAHOTSAV
AZADI KA AMRIT MAHOTSAV

By

Published : Feb 25, 2022, 7:15 AM IST

AZADI KA AMRIT MAHOTSAV: ఝాన్సీకి సమీపంలోని భోజ్లా గ్రామంలో 1830లో జన్మించిన ఝల్కరీ బాయి చిన్నతనమంతా అడవుల్లో పశువులను మేపటం, పుల్లలు ఏరుకొని రావటంలో గడిచింది. తల్లి చిన్నతనంలోనే చనిపోగా తండ్రి షడోబా సింగ్‌ ధైర్యసాహసాలు నూరిపోస్తూ ఆమెను పెంచారు. కత్తిసాము, గుర్రపుస్వారీ నేర్పించారు.

అడవిలో పశువులను మేపటానికి తీసుకుపోగా... ఓరోజు పులి దాడి చేసింది. ధైర్యంగా ఎదురొడ్డి గొడ్డలితో పులిని చంపింది ఝల్కరీ. మరోమారు... గ్రామంలో దొంగలు పడితే ఎదుర్కొంది. ఝల్కరీబాయిలోని ఈ ధైర్య సాహసాలను మెచ్చుకున్న గ్రామస్థులు ఆమెకు తగ్గట్లుగా... ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో పనిచేసే పూరణ్‌సింగ్‌తో వివాహం చేశారు. ఝాన్సీ సైన్యంలో పూరణ్‌కూ మంచి పేరుండేది.

ఓ సారి గ్రామస్థులందరితో కలసి రాణివాసంలో గౌరీపూజకు వెళ్లింది ఝల్కరీ. ఈ సందర్భంగానే... అచ్చంగా తనను పోలినట్లే ఉన్న ఆమెను చూసి ఝాన్సీ రాణి ఆశ్చర్యపోయింది. ఝల్కరీ సాహసాల గురించి కూడా విని... వెంటనే తన సైనిక మహిళా విభాగం 'దుర్గాదళ్‌'లో చేరమని ఆహ్వానించింది. అంగీకరించిన ఝల్కరీ తక్కువ సమయంలోనే తుపాకీ, ఫిరంగులు పేల్చటంలోనూ శిక్షణ పొంది... రాణికి దగ్గరై... దుర్గాదళ్‌ నాయకురాలిగా ఎదిగింది.

రాజు మరణించిన తర్వాత... రాణి వారసత్వాన్ని గుర్తించని ఆంగ్లేయులు ఝాన్సీని స్వాధీనం చేసుకోవటానికి రంగంలోకి దిగారు. పోరు మొదలైంది. చాలారోజులు తీవ్రంగా ప్రతిఘటించినా... తన సైనికాధికారి వంచన కారణంగా కోట దర్వాజా ఒకటి తెరచుకొని... ఆంగ్లేయులు దూసుకొచ్చారు. కోటను కాపాడుకోవటం కష్టమైన వేళ రాణి సహచరులు ఆమెకు తప్పించుకోవాలని సలహా ఇచ్చారు. కానీ తానందుకు ఇష్టపడలేదు. ఈ తరుణంలో... ఝల్కరీబాయి ముందుకొచ్చి... 'బతికుంటే మళ్లీ పుంజుకొని దాడి చేయొచ్చు. ప్రస్తుతానికి బయల్దేరండి' అంటూ రాణిని భద్రంగా కోట దాటించింది. ఆ విషయం బయటకు చెప్పలేదు. తన రూపురేఖలను ఉపయోగించుకుంటూ రాణిలా వస్త్రధారణ చేసి మిగిలిన సైన్యానికి సారథ్యం వహించింది ఝల్కరీబాయి. ఆంగ్లేయులకు అనుమానం రాకుండా, రాణి వెంట పడకుండా ఉండేందుకు... తానే ధైర్యం చేసి ఏకంగా బ్రిటిష్‌ జనరల్‌ హ్యూ రోస్‌ శిబిరానికి గుర్రంపై దూసుకెళ్లింది. జనరల్‌తో మాట్లాడాలంటూ... సందేశం పంపించింది.

ఎంతో వీరోచితంగా తమతో పోరాడుతున్న ఝాన్సీరాణి ఇలా... లొంగిపోవటానికి రావటం హ్యూరోస్‌ను కాస్త ఆశ్చర్యపరిచింది. కానీ వచ్చింది రాణి కాదని వారు గుర్తించలేకపోయారు. 'మా నుంచి ఏం కోరుకుంటున్నారు?' అంటూ జనరల్‌ రోస్‌ అడగ్గా... 'ఉరితీయండి' అని ఠక్కున బదులిచ్చింది ఝల్కరీ! ఆ సమాధానం విన్న జనరల్‌ 'ఒకశాతం మంది భారతీయ మహిళలు ఇలాంటి ధైర్యాన్ని ప్రదర్శిస్తే మా బ్రిటిష్‌వారు వెంటనే దేశం విడిచి పారిపోతారు' అని వ్యాఖ్యానించాడు. రాణి తప్పించుకోవడానికి ఈ సంప్రదింపుల సమయం సరిపోయింది. మరుసటి రోజు... కోట దర్వాజా తెరవటంలో ఆంగ్లేయులకు సహకరించిన దుల్హాజూ అనే ఝాన్సీ సైనికుడు ఝల్కరీని గుర్తుపట్టాడు. ఆ తర్వాత ఝల్కరీని బ్రిటిష్‌ వారు ఏం చేశారనే దానిపై భిన్న కథనాలున్నాయి. ఆమె ధైర్యానికి మెచ్చిన ఆంగ్లేయ జనరల్‌ విడిచి పెట్టాడని కొందరంటే... మోసం చేసినందుకు అక్కడే ఉరితీశారని మరికొందరు రాశారు. మొత్తానికి... ఝాన్సీ రాణిని సురక్షితంగా తప్పించిన ఝల్కరీ... మళ్లీ ఎన్నడూ తన రాణిని కలుసుకోలేకపోయింది. జానపద పాటల్లో ఝల్కరీబాయి ఇప్పటికీ నిలిచి ఉంది. భారత ప్రభుత్వం ఆమె పేరిట పోస్టల్‌ స్టాంపు కూడా విడుదల చేసింది.

ఇదీ చూడండి:'ఉక్రెయిన్​లోని భారతీయుల భద్రతకే అధిక ప్రాధాన్యం'

ABOUT THE AUTHOR

...view details