కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కోల్‌కతా జాతీయ సమావేశంలో మహిళలతో ప్రత్యేకంగా పరేడ్ నిర్వహించిన సుభాష్ చంద్రబోస్... చరిత్ర సృష్టించారు. తన ఆజాద్ హింద్ ఫౌజ్(ఐఎన్ఏ-ఇండియన్ నేషనల్ ఆర్మీ)లోనూ మహిళలకు పెద్దపీట వేశారు. రెండో ప్రపంచ యుద్ధం తొలినాళ్లలో బ్రిటన్ను ఓడించిన జపాన్... సింగపూర్‌ను కైవసం చేసుకుంది. నేతాజీ వెంటనే జర్మనీ నుంచి 1943 జులైలో సింగపూర్ చేరుకున్నారు. సింగపూర్, మలేసియాల్లో ఇంగ్లండ్ తరఫున పోరాడుతూ పట్టుబడిన భారతీయ సైనికులతోపాటు కొందరు స్థానిక భారతీయులతో ఐఎన్ఏ సిద్ధమైంది. జులై 5న 12 వేల మందితో సమావేశం ఏర్పాటైంది. దీనికి స్థానిక భారతీయ పౌరులనూ అనుమతించారు. "మహిళలు కూడా ముందుకొచ్చి పాల్గొనకుంటే ఈ సమరం అసంపూర్ణం అవుతుంది. రాణీ ఝాన్సీలక్ష్మీ బాయి పేరిట మహిళా దళాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నా" అని బోస్ ప్రకటించారు. రెజిమెంట్ బాధ్యతలను 28 ఏళ్ల డాక్టర్ లక్ష్మీ స్వామినాథన్‌కు అప్పగించారు. ఆమె మద్రాసులో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆంగ్లేయుల కొలువులో పనిచేయడం ఇష్టం లేక సింగపూర్ వచ్చారు. గైనకాలజిస్టుగా పేరు గడించారు. వివిధ దక్షిణాది భాషలనూ నేర్చుకున్నారు. వీటికితోడు అక్కడి భారత రాజకీయ బృందాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
ఒక్క రోజులోనే రెజిమెంట్ సిద్ధం..నేతాజీ సభలకు మంచి స్పందనైతే వచ్చిందిగానీ.. ముందుకొచ్చే మహిళలు లేరు. సింగపూర్, మలేసియాల్లో చాలామంది సంప్రదాయ భారతీయ కుటుంబాల వారే ఉన్నారు. మధ్య తరగతి వారేమో తమ పిల్లలతో తుపాకులు పట్టించడానికి ఇష్టపడలేదు. 1943 జులై 12న జరిగే సభలో బోస్ పాల్గొనాల్సి ఉంది. దీన్నే ఝాన్సీలక్ష్మీ రెజిమెంట్ ప్రారంభోత్సవంగా మార్చాలనుకున్నారు డాక్టర్ లక్ష్మి. జులై 11న సింగపూర్‌లోని భారతీయ స్వాతంత్య్ర బృందం ఛైర్మన్ ఎల్లప్పతో కలసి.. ఇరవై మంది యువతులను సమీకరించారు. వారికి రోజంతా ఐఎన్ఏ బృందంతో సాయుధ శిక్షణ ఇప్పించారు. మరునాటి సభలో వారంతా చీరకట్టులోనే ఆయుధాలతో బోస్‌కు గౌరవ వందనం సమర్పించారు. ఇది చూసి ఆయన సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఝాన్సీ రెజిమెంట్‌కు డాక్టర్ లక్ష్మిని కమాండర్‌గా నియమించారు.