Pedanandipadu non cooperation movement: గాంధీజీ నాయకత్వంలో అహింసా పద్ధతుల్లో ఆంగ్లేయులపై పోరాటం కొత్త పంథా తొక్కుతున్న వేళ అది! 1921 అహ్మదాబాద్ కాంగ్రెస్ మహాసభ దేశవ్యాప్తంగా శాసనోల్లంఘన.. పన్నుల నిరాకరణ చేపట్టాలని తీర్మానించింది. ఈ విషయం తెలియగానే, గుంటూరు కాంగ్రెస్ పార్టీ చొరవ తీసుకొని పెదనందిపాడును పన్నుల నిరాకరణకు సరైన ప్రాంతంగా ఎంచుకుంది. అప్పటికి రాష్ట్ర నాయకులంతా జైళ్లలో ఉన్నారు. మాచిరాజు రామమూర్తి, పర్వతనేని వీరయ్య చౌదరి చొరవ తీసుకొని అన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రజల్ని శాంతియుతంగా పన్నుల నిరాకరణకు సిద్ధం చేశారు. నాలుగు వేలమంది యువకులతో వీరయ్య చౌదరి శాంతిసేనను ఏర్పాటు చేశారు.
బర్దోలిలో గాంధీజీ ఆరంభించాలనుకున్న ఉద్యమం కంటే ముందే.. పన్నుల సహాయ నిరాకరణ పెదనందిపాడులో మొదలైంది. వీరయ్య చౌదరి మాటకు విలువిస్తూ.. పెదనందిపాడు పరిధిలోని 18 గ్రామాల్లోని కరణాలు, మునసబులు, గ్రామాధికారులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఆంగ్లేయ సర్కారు రెవెన్యూ సభ్యుడైన హారిస్‌ను రాయబారానికి పంపింది. అదీ విఫలమైంది. ఉలిక్కిపడ్డ ఆంగ్లేయ సర్కారు.. ప్రత్యేకంగా అదనపు కలెక్టర్ రూథర్‌ఫర్డ్‌ను దించింది. ప్రజలు చెల్లించిందెంత?.. ఇంకా చెల్లించాల్సిందెంత?... ఏ రికార్డులూ అందుబాటులో లేవు. అంతా అయోమయం. రూథర్‌ఫర్డ్ రిజర్వ్ పోలీసులను, బ్రిటిష్ సైన్యాన్ని రప్పించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఆంగ్లేయులు ప్రజలపై, శాంతిసైనికులపై ఉమ్మేశారు. తిట్లతో ఉసిగొల్పారు. కానీ శాంతిసైనికుల కారణంగా ప్రజలెవ్వరూ సహనం కోల్పోలేదు. ఆంగ్లేయ సైన్యం ఇళ్లలోకి చొరబడి అందుబాటులో ఉన్న ధాన్యాన్ని స్వాధీనం చేసుకుంది. భూములను వేలం వేశారు. కొనేవారు లేరు. ఉద్యమం ఊపందుకొని.. క్రమంగా జిల్లా అంతటా విస్తరించసాగింది. ప్రభుత్వ వసూళ్లు పడిపోయాయి. గాంధీజీ ఆంగ్లేయ సర్కారుకు రాసిన లేఖలో తెలుగు ప్రజల అహింసా పద్ధతిని ప్రస్తావించటంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టీ పెదనందిపాడుపై పడింది.