Azadi Ka Amrit Mahotsav: బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీని తూర్పు ఆసియాలో ఇంగ్లాండ్ తరఫున వ్యాపారం చేసేందుకు 1600 సంవత్సరం డిసెంబరులో స్థాపించారు. కొంతమంది ఇంగ్లాండ్ వ్యాపారవేత్తలు (వీరిలో ఓ మద్యం వ్యాపారి, వస్త్రవ్యాపారి, తోలువ్యాపారితో పాటు కొంతమంది సముద్ర దొంగలు కూడా ఉన్నట్లు చెబుతారు) ఉమ్మడిగా... 60 వేల పౌండ్ల పెట్టుబడితో జాయింట్ స్టాక్ కంపెనీగా మొదలైంది. బ్రిటన్ రాణి అనుమతితో భారత ఉపఖండంలో వ్యాపారాన్ని మొదలెట్టారు.
East india company rule in india: అప్పటికే స్పెయిన్, పోర్చుగల్‌కు చెందిన కంపెనీలు ఈ ప్రాంతంలో వ్యాపారంలో స్థిరపడ్డాయి. వారిని చూసే ఇంగ్లాండ్ ఈస్టిండియా కంపెనీ రంగంలోకి దిగింది. ఆరంభించిన తొలినాళ్లలో ఈస్టిండియా కంపెనీకి ప్రత్యేకంగా కార్యాలయం అంటూ ఏమీ లేదు. మొదటి 20 సంవత్సరాల పాటు... లండన్‌లోని తమ డైరెక్టర్ థామస్ స్మిత్ ఇంటి నుంచే కార్యకలాపాలు సాగించింది. సిబ్బంది ఆరుగురే! భారత్‌పై పట్టు బిగించేనాటికి లండన్‌లో చిన్న కార్యాలయంలో 35 మంది సిబ్బంది ఉండేవారు. భారత్‌లో పాలనాధికారం చేపట్టిన 30 సంవత్సరాలకుగానీ (1790 నాటికి)... వారి లండన్ కార్యాలయ సిబ్బంది సంఖ్య 150 దాటలేదు.
ఇదీ చూడండి:Azadi Ka Amrit Mahotsav: బ్రిటిష్ గుండెల్లో 'బాంబు' పేల్చి.. చిరునవ్వుతో ఉరికంబమెక్కి
కేవలం 3వేల మందితో...
East india army: వ్యాపార రక్షణ కోసం తొలుత కొంతమంది సాయుధులను ఇంగ్లాండ్ నుంచి తెచ్చుకున్న ఈస్టిండియా దీన్ని ప్రణాళికాబద్ధంగా పెంచుకుంది. డచ్, ఫ్రెంచ్ తదితర కంపెనీలతో పోరాటాలకుగాను స్థానికులనే సైనికులుగా నియమించుకున్నారు. ప్లాసీ యుద్ధంలో రాబర్ట్‌క్లైవ్ సైన్యం 3 వేల మందే. వారితోనే 50వేల మంది సైన్యమున్న మొఘల్ నవాబును ఎదుర్కొని విజయం సాధించాడు క్లైవ్. 1778 నాటికి 70 వేలకు చేరిన ఈస్టిండియా సైన్యంలో చాలామంది భారతీయులే. వారికి యూరోపియన్లతో శిక్షణ ఇప్పించేవారు. ఇలా పెంచుకున్న సైన్యాన్ని మెల్లగా అధికార విస్తరణకూ ఉపయోగించుకుంది. భారత్‌లోని వివిధ రాజ్యాల మధ్య అనైక్యతను ఆలంబనగా చేసుకొని వారి మధ్య చిచ్చు పెట్టి తాను అధికారం చలాయించటం ఆరంభించింది. బ్రిటన్‌లోని పారిశ్రామికీకరణ పుణ్యమా అని వచ్చి పడిన ఆధునిక ఆయుధాలు తోడవటంతో స్థానిక రాజ్యాల సైన్యం సంఖ్యలో పెద్దదైనా నిలవలేని పరిస్థితి. పందొమ్మిదో శతాబ్దం ఆరంభానికి ఈస్టిండియా సైనికుల సంఖ్య రెండున్నర లక్షలకు చేరింది. ఆ సమయానికి బ్రిటన్ సైన్యం కంటే ఇదే పెద్దదంటారు.
భారత్‌లో దోచుకున్న సొమ్మును స్టాక్ డివిడెండ్ల రూపంలో బ్రిటన్‌లోని పార్లమెంటు సభ్యులకు పంచేవారు. బ్రిటన్ పార్లమెంటును కూడా పరోక్షంగా గుప్పిట పెట్టుకునే పరిస్థితి. అలా ఓ వ్యాపార సంస్థ ప్రపంచ చరిత్రగతిని మార్చింది. 1833లో పార్లమెంటు ఆమోదం ద్వారా కంపెనీని జాతీయం చేశారు. కానీ సిపాయిల తిరుగుబాటుతో 1858లో ఈస్టిండియా కంపెనీ పాలన ముగిసి... బ్రిటిష్ ప్రభుత్వ పాలన మొదలైంది. 1874లో ఈ కంపెనీని పూర్తిగా రద్దు చేశారు.
ఇదీ చూడండి:Azadi Ka Amrit Mahotsav: ఆంగ్లేయుల అరాచకాలను ప్రపంచానికి చెప్పినందుకు..