Durgawati Devi Bhagat Singh: 1928 డిసెంబరులో సరిగ్గా ఇదే రోజు.. 17వ తేదీ. లాహోర్‌లోని పోలీస్ స్టేషన్ నుంచి మోటార్ బైక్‌పై బయటకు వచ్చిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జె.పి. శాండర్స్‌కు వీధి చివరి నుంచి వచ్చిన పిస్తోలు గుండు తాకింది. కిందపడగానే... బుల్లెట్ల వర్షం కురిసింది. అక్కడికక్కడే చనిపోయాడు శాండర్స్. తొలి బుల్లెట్ రాజ్‌గురుదైతే... తర్వాత ప్రాణంతీసిన తూటాలు భగత్‌సింగ్‌వి. పారిపోతుంటే... వెంటాడటానికి ప్రయత్నించిన పోలీస్ కానిస్టేబుల్ చన్నన్‌సింగ్‌ను కూడా కాల్చేశారు.
ఈ దాడికో నేపథ్యముంది. అప్పటికి కొద్దిరోజుల కిందటే.. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాహోర్‌లో ప్రదర్శన జరిగింది. లాలా లజపతిరాయ్ సారథ్యంలో సాగిన ఆ ప్రదర్శనపై సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ జేమ్స్ స్కాట్ ఆధ్వర్యంలోని బ్రిటిష్ పోలీసులు విరుచుకుపడ్డారు. విపరీతంగా కొట్టారు. స్కాట్ స్వయంగా లాలా లజపతిరాయ్‌పై చేయిచేసుకున్నాడు. తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చేరిన లాలా 1928 నవంబరు 17న మరణించారు. లాఠీదాడికి ప్రత్యక్ష సాక్షులైన భగత్‌సింగ్, ఆయన సహచరులు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. ఫలితమే శాండర్స్‌పై దాడి. నిజానికి వాళ్ల లక్ష్యం స్కాట్. కానీ అనుకోకుండా శాండర్స్ బయటకు రావటం వల్ల ఆయనపైనే దాడి జరిగింది. లాలాపై లాఠీఛార్జి జరిగినప్పుడు శాండర్స్ కూడా ఉన్నాడు.
శాండర్స్‌పై దాడి వార్త లాహోర్ అంతటా దావానలంలా వ్యాపించింది. కాల్పులు జరిపింది ఓ సిక్కు యువకుడని తెలుసుకుని బ్రిటిష్ ప్రభుత్వం గాలింపు ముమ్మరం చేసింది. ఎటుచూసినా పోలీసులే. అలాంటివేళ ఓ రోజు ఉదయం లాహోర్ రైల్వే స్టేషన్ పోలీసు కళ్లతో కిటకిటలాడుతోంది. చక్కగా గడ్డం గీక్కొని.. సూటూబూటూ వేసుకొని తలపై ఇంగ్లిష్ టోపీ పెట్టుకున్న ఆ యువకుడికి తోడు చేతిలో చేయి వేసుకున్న అందమైన యువ భార్య. అందరి కళ్లూ ఆమెపైనే నిలిచాయి. వెంట సొట్టబుగ్గల చిన్న పిల్లాడు. చూడచక్కని జంట అని అంతా కళ్లప్పగించి చూస్తుంటే అందరినీ దాటుకుంటూ ఠీవిగా ఆ కుటుంబం కాన్పుర్ వెళ్లే రైలులో ఫస్ట్‌క్లాస్ బోగీలో ఎక్కింది. రైలు కదిలిపోయింది. పోలీసు కళ్లు ఇంకా వెదుకుతూనే ఉన్నాయి.