1921 నవంబరు 21... తమిళనాడు పొదనూర్ జంక్షన్‌లో వచ్చి ఆగిందో గూడ్సు రైలు. దాని బోగీ తలుపు తీయగానే... పదుల సంఖ్యలో మృతదేహాలు ప్లాట్‌ఫామ్‌పై పడ్డాయి. వీరంతా... కేరళలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా మలబార్ పోలీసులతో పోరాడిన రైతులు. ఖిలాఫత్ ఉద్యమం తర్వాత గాంధీజీ ఇచ్చిన పిలుపు మేరకు మలబార్ ప్రాంతంలో సహాయ నిరాకరణ ఉద్యమం ఉద్ధృతంగా సాగింది. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో తొక్కేయటానికి ఆంగ్లేయ సర్కారు సర్వవిధాలుగా ప్రయత్నించింది. ఈ క్రమంలో... మలప్పురం-పాలక్కాడ్ మధ్య ఓ వంతెనను కూల్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై... నవంబరు 19న పోలీసులు 100 మందిని అరెస్టు చేశారు. స్థానికంగా ఇబ్బందులు సృష్టిస్తున్నారని... వీరిని రైలు ద్వారా... తిరూర్ నుంచి కర్ణాటకలోని బళ్లారి కేంద్ర కారాగారానికి తరలించాలనుకున్నారు. ఆ క్రమంలో తాము మనుషులమని... అరెస్టు చేసి తీసుకెళుతున్నవారూ మనుషులని మరచిపోయారు. నిందితులందరినీ ఒకే బోగీలో పంపించాలని మలబార్ పోలీసు సూపరింటెండెంట్ రిచర్డ్ హార్వర్డ్ హిచ్‌కాక్... ఆదేశాలు జారీ చేశాడు. దాంతో... అత్యంత దారుణంగా ఒక గూడ్సు వ్యాగన్‌లో 100 మందినీ కుక్కారు. గాలి వెలుతురు వచ్చే కిటికీ కూడా అవకాశం లేని బోగీ అది. రాత్రి బయలుదేరిన రైలు 140 కిలోమీటర్లు ప్రయాణించి ఉదయానికల్లా కోయంబత్తూరు సమీపంలోని పొదనూరు చేరింది. అప్పటికే ఊపిరి ఆడక... 64 మంది రైతులు చనిపోయారు. మరో ఆరుగురు ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. చాలామంది ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్నారు. ఇంకొంతమంది తమ మూత్రం తామే తాగి ప్రాణాలు నిలబెట్టుకున్నారు.
అలా ప్రాణాలతో మిగిలిన వారిలో ఒకరైన అహ్మద్ హాజి రాత్రంతా బోగీలో ఏం జరిగిందో వివరిస్తుంటే విన్నవారెవరికైనా ఒళ్లు జలదరించకమానదు. 'సన్నటి రంధ్రం ద్వారా వచ్చీ రాకుండా వస్తున్న సన్నని గాలిని పీల్చటానికి లోపలున్న వారంతా ఎగబడ్డారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చివరికి కొంతమంది గాలి ఆడక... మరికొందరు దప్పికై పడిపోయారు. ఇంకొంతమంది తమ చెమటను, మరికొందరు అతికష్టం మీద మూత్రం తాగి ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఎంతగా మొత్తుకున్నా, ఎంత బాదినా... ఎక్కడా తలుపు తెరవలేదు ఆంగ్లేయులు. నేనూ స్పృహతప్పి పడిపోయా. తలుపు తెరిచి... నీళ్లు చల్లాక కళ్లు తెరిచా. ఆసుపత్రిలో బతికి బయటపడ్డా’ అంటూ అహ్మద్ హాజి ఆనాటి నరకయాతనను వివరించారు. చనిపోయినవారందరినీ మళ్లీ అదే వ్యాగన్లో తిరూర్‌కు పంపించారు. తిరూర్ మున్సిపాలిటీ టౌన్‌హాల్‌ను ఈ వ్యాగన్ ఊచకోతకు స్మారకంగా... రైల్వే బోగీ రూపంలో నిర్మించారు. లైబ్రరీలు, మరికొన్ని భవనాలను కూడా ఇదే తీరుగా కట్టారు.
అత్యంత కిరాతకమైన ఈ మారణకాండను... బ్రిటిష్ ప్రభుత్వం మామూలు సంఘటనగా చిత్రీకరించి మసిపూసి మారేడుకాయ చేసింది. చిన్నదిగా చూపటానికి ప్రయత్నించింది. ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవటంతో... చనిపోయిన కుటుంబాలకు తలా రూ.300 చొప్పున ఇచ్చి చేతులు దులుపుకొంది. రిచర్డ్ హిచ్‌కాక్ ఈ సంఘటనను మానవ తప్పిదంగా అభివర్ణించాడు. జర్మనీలో నాజీలు ఇలాగే... యూదులను రైల్వే వ్యాగన్లలో పశువులకంటే హీనంగా బంధించి తీసుకెళ్లేవారని ప్రచారం చేసిన బ్రిటన్ భారత్‌లోనూ అలాగే వ్యవహరించింది. ఇదొక్కటే కాకుండా... మలబార్ ప్రాంతంలో రైతులను, రాజకీయ ఖైదీలను అనేకసార్లు ఇలాగే పశువుల్లా గూడ్సు వ్యాగన్లలో కుక్కి తీసుకొని వెళ్లేవారు. పొదనూర్ సంఘటనతో ఆంగ్లేయుల అరాచకత్వం లోకానికి తెలిసింది.