Ayodhya Real Estate Boom : అయోధ్యలో రామమందిర నిర్మాణం నేపథ్యంలో అక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ ఏర్పడింది. రామనగరిలో వ్యాపారం చేసేందుకు అనేక మంది మొగ్గు చూపుతున్నారు. అయోధ్యతో పాటు పరిసర ప్రాంతాల్లో, రహదారులకు సమీపంలో వాణిజ్య, నివాస స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. ఇతర నగరాల్లో ఉన్న వారు సైతం ఇక్కడే నివసించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా రిజిస్ట్రేషన్లు పెరిగి రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం వస్తోంది. రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ లెక్కల ప్రకారం సుమారు ఒకటిన్నర రెట్లు అధికంగా రిజిస్ట్రేషన్లు పెరిగాయి.
ఆశ్రమాలు, హోటళ్లు, గెస్ట్ హౌస్లు, ఆలయాలు, రెస్ట్ హౌస్లు నిర్మించేందుకు అనేక మంది భూములను కొనుగోలు చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం వరకు అయోధ్యలో సంవత్సరానికి 28,000 రిజిస్ట్రేషన్లు జరగగా, ప్రస్తుతం ఆ సంఖ్య 50,000కు చేరింది. అప్పట్లో సుమారు రూ.92 కోట్ల ఆదాయం వస్తుండగా, ప్రస్తుతం ఆ మొత్తం రూ.178 కోట్లకు చేరుకుంది. అయోధ్య రామమందిరం ప్రారంభం కావడం వల్ల ఉత్తర్ప్రదేశ్ నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.
"అయోధ్య రామనగరిగా ఇప్పుడు ప్రఖ్యాతి గాంచింది. ఘనంగా నిర్మించిన రామాలయం జనవరి 22న ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే అనేక మంది ప్రజలు ఇక్కడ భూములు కొని వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా రిజిస్ట్రేషన్లు పెరిగి ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోంది."
--రవీంద్ర జైశ్వాల్, రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి