Ayodhya Ram Mandir Construction :వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కళాకారులు గ్రౌండ్ ఫ్లోర్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. ఆలయ తలుపులు, గోపురానికి బంగారు తాపడం పని మొదలైంది. అందులో భాంగంగా గ్రౌండ్ ఫ్లోర్‌లోని 14 తలుపులను ముందుగా రాగితో తాపడం చేస్తారు. అనంతరం దానిపైన బంగారు పూత పూస్తారు. దీని కోసం దిల్లీకి చెందిన ప్రముఖ కళాకారులు ఇప్పటికే ఆయోధ్య చేరుకున్నారు.
100 మీటర్లు నడవనున్న ప్రధాని మోదీ!
Ayodhya Ram Mandir Opening Date :మరోవైపు, ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు మేధోమథనం చేస్తున్నారు. అందులో భాగంగా ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమాలను ట్రస్ట్ సభ్యులు ప్లాన్ చేశారు. దాని ప్రకారం 2024 జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ హెలికాప్టర్లో అయోధ్యకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రామమందిరం కాంప్లెక్స్ వద్దకు వస్తారు. అనంతరం 100 మీటర్లు నడిచి గర్భగుడి వద్దకు చేరుకుంటారు.
రాముడి కిరీటంలో వజ్రాలు..!
Ayodhya Ram Temple Donation :శ్రీరాముడి బంగారు కిరీటంలో పొదిగేందుకు వజ్రాలు తాను సమర్పిస్తానని అహ్మదాబాద్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి ప్రాతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనపై ట్రస్ట్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న రామభక్తులు రామాలయ నిర్మాణానికి బంగారం- వెండి ఆభరణాలు, వజ్రాలు, నగదు తదితరాల రూపంలో విరాళాలు ఇస్తున్నారు.