Ayodhya Ram Mandir Construction Status :అయోధ్యలోరామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్టాపన (Ayodhya Ram Mandir Inauguration) తేదీని ఖరారు చేసిన క్రమంలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులు చివరిదశకు చేరుకోగా.. గర్భగుడి ఫ్లోరింగ్ చకచకా సాగుతోంది. విగ్రహాన్ని ప్రతిష్ఠించే స్థలానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో తలుపులు, కిటికీలను అమర్చుతున్నారు. డిసెంబర్ నాటికి ఈ పనులన్నీ పూర్తికానున్నాయి. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్‌లోని స్తంభాలపై రామాయణ ఘట్టాలను వివరించే శిల్పాలను తీర్చిదిద్దుతున్నారు.
"వివిధ ప్రాంతాల నుంచి రాళ్ళను ఇక్కడికి తీసుకొచ్చాం. వాటిని చెక్కేందుకు వేరేచోట్లకు తరలించాం. అవి తిరిగి వచ్చాక ప్రతిష్టిస్తాం. అంతలోపు ఇక్కడి పనులు పూర్తవుతాయి. స్తంభాలపై శిల్పాలను చెక్కే పని జరుగుతోంది. 70 స్తంభాలను ఇక్కడ ఏర్పాటు చేయనున్నాం"
--అనిల్ మిశ్ర, రామమందిర ట్రస్టు సభ్యుడు
13 కిలో మీటర్ల 'రామ్‌పథ్'..
Ayodhya Ram Mandir Update : రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయోధ్య రాముడి దర్శనం కోసం వచ్చే భక్తులు సులభంగా ఆలయానికి చేరుకోడానికి.. సహదత్‌గంజ్ నుంచి నయా ఘాట్ వరకు దాదాపు 13 కిలో మీటర్ల పొడవైన 'రామ్‌పథ్'ను (Rampath Ayodhya) నిర్మిస్తున్నామని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్- డీఎమ్ నీతీశ్ కుమార్ తెలిపారు. ఈ రామ్‌పథ్ నిర్మాణాన్ని మూడు దశల్లో చేపడుతున్నట్లు చెప్పారు. డిసెంబర్‌లోపు ఈ రామ్‌పథ్ నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు.