Relief to MP Avinash Reddy: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ప్రస్తుతానికి ఊరట దక్కింది. ఈ కేసులో ఈ నెల 16న తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్టుతో తనను అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన అవినాష్ రెడ్డి.. తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. మంగళవారం కూడా వాదనలు కొనసాగాయి.
బెయిల్ పిటిషన్‌లో అవినాష్: వివేకా హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి తెలిపారు. దస్తగిరి వాంగ్మూలం మేరకు నన్ను ఇరికించాలని సీబీఐ చూస్తోందని ఆరోపించారు. నిందితుడిగా చేర్చి అరెస్టు చేసే ఉద్దేశంలో సీబీఐ ఉందని బెయిల్ పిటిషన్‌లో వెల్లడించారు. ఈ కేసులో ఆశ్చర్యంగా గూగుల్ టేకవుట్ డేటాను తెరపైకి తెచ్చిందని అవినాష్ రెడ్డి తెలిపారు. ఒక వ్యక్తి ఎక్కడున్నారో గూగుల్ టేకవుట్ డేటా చెప్పలేదని బెయిల్ పిటిషన్‌లో అవినాష్ రెడ్డి ప్రస్తావించారు. నాలుగేళ్లలో అనేక పరిణామాల తర్వాత నన్ను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. తనను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు.. ఒకవేళ అరెస్టు చేస్తే బెయిల్‌పై విడుదల చేసేలా సీబీఐని ఆదేశించాలి అని బెయిల్ పిటిషన్‌లో అవినాష్‌రెడ్డి వెల్లడించారు.
అవినాష్‌రెడ్డికి ముందే తెలుసు:అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదించింది. గతంలో నాలుగు విచారణల్లో అవినాష్ సహకరించలేదని.. అవినాష్ నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని.. సీబీఐ కోర్టుకు తెలిపింది. వివేకా హత్య కుట్ర వైఎస్ అవినాష్ రెడ్డికి తెలుసని.. దర్యాప్తులో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలు సేకరించామని.. సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. హత్యకు ముందు, తర్వాత అవినాష్ ఇంట్లో సునీల్‌యాదవ్, ఉదయ్‌కుమార్ రెడ్డి ఉన్నారని.. హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అవినాష్ రెడ్డి జమ్మలమడుగుకు వెళ్లే మార్గంలో ఉన్నట్లు చెప్పారని.. మొబైల్ సిగ్నల్స్ చూస్తే ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోందని సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అవినాష్ రాత్రంతా ఫోన్‌ను అసాధారణంగా వినియోగించినట్లు గుర్తించామన్నారు. అవినాష్ రెడ్డి చాలా ప్రభావం చేయగల వ్యక్తని.. సీబీఐ న్యాయవాది కోర్టుకు వివరించారు. వివేకా ఆర్థిక, వివాహేతర సంబంధాలపై ఆధారాలు లేవన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెలాఖరు నాటికి దర్యాప్తు పూర్తిచేయాల్సి ఉందని తెలంగాణ హైకోర్టుకు తెలిపారు.
సీబీఐ నోటీసులు ఇచ్చిన ప్రతిసారి అవినాష్ కోర్టుకు వస్తున్నారని.. వివేకా కుమార్తె సునీత తరపున న్యాయవాది అభ్యంతరం తెలిపారు. అవినాష్ ప్రమేయంపై నిందితులు, సాక్షులు సీబీఐకి చెప్పారని వాదించారు. అయితే వివేకానందరెడ్డి బంధువు కనుక హత్యాస్థలానికి వెంటనే అవినాష్ రెడ్డి వెళ్లారని.. ఆయన తరఫు న్యాయవాది వాదించారు. గదిని శుభ్రం చేయడం వెనుక ఎలాంటి కుట్ర లేదన్నారు. గుండెపోటు అని ఎందుకు చెప్పారని అవినాష్ రెడ్డి న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. అక్కడున్న వారు చెబితే అదే విషయం చెప్పారని అవినాష్ న్యాయవాది చెప్పారు. హత్య విషయం అవినాష్ కంటే ముందు వివేకా అల్లుడికి తెలుసని న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.
వాదనలు విన్న న్యాయస్థానం.. అవినాష్ రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయవద్దని.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 25 వరకు అవినాష్ ప్రతిరోజు సీబీఐ విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. అవినాష్ విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని.. అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై 25న తుది తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది.
అవినాష్ రెడ్డి మంగళవారం సాయంత్రం సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆ విచారణను.. బుధవారం నిర్వహిస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. హైకోర్టులో వాదనలు రీత్యా బుధవారం ఉదయం పదిన్నరకు విచారణకు పిలుస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది.